ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు విశేష స్పందన
వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
సద్వినియోగం చేసుకోవాలి: వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవీస్
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25 : తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ప్రకటించిన తరుణంలో అభ్యర్థులకు సిటీ పోలీసు యంత్రాంగం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ పిలుపునిచ్చారు. సోమవారం యూసఫ్‌గూడ కోట్ల విజయభాసర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో వెస్ట్ జోన్ పోలీసులు 90 రోజుల వ్యవధిలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగ సాధనకు ఎన్నో వ్యయప్రయాసలు పడేవారని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ ఉచిత శిక్షణ ఎంతో దోహదపడుతుందని చెప్పారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ పోలీసులు నిర్వహించిన ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు వందలాది మంది నిరుద్యోగులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ మధుకర్ స్వామి, అడిషనల్ డీసీపీలు సిద్దిఖీ, సుదర్శన్, సతీశ్, శివమారుతి, భాగ్య కిరణ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ భాగ్య కిరణ్, చరిత, ప్రియదర్శిని, మోటీవేషనల్ స్పీకర్ అఖిల రాజేందర్, ప్రముఖ గాయకుడు లక్ష్మణ్ సాయి, వెస్ట్‌జోన్ పోలీసులు పాల్గొన్నారు.
ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సివిల్ సర్వీసెస్ అకాడమీ కేంద్రం సోమవారం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైంది. ఈ ఉచిత కోచింగ్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. గంట ముందుగా వచ్చినా సీటు
దొరక్కపోవడంతో హాల్ బయట ఉండే క్లాస్‌లు వింటూ నోట్స్ రాసుకున్నారు.
ఉద్యోగాల జాతర
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ శాఖలో 16 వేల 27 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రాబోయేరోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఇందుకు నిరుద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్, మెటీరియల్, మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చే ప్రణాళికలు ఉన్నాయి. నిరుద్యోగులు సమయాన్ని వృథా చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కిశోర్‌గౌడ్ రాష్ట్ర, బీసీ కమిషన్ సభ్యుడు
సంతోషంగా ఉంది
ప్రభుత్వం పోలీసు నియామకాల నోటిఫికేషన్ జారీ చేయడంపై ఎంతో సంతోషంగా ఉంది. నేను బీటెక్ పూర్తి చేశాను. ఇటీవల పోలీసు శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ కోసం పరీక్ష కూడా రాశాను. పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
– ఆదిత్య ఎర్రబెల్లి, అంబేద్కర్‌నగర్
పోలీస్ ఉద్యోగం సాధిస్తా..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నాటి నుంచే పోలీస్ ఉద్యోగం సాధించడానికి శిక్షణ పొందుతున్నాను. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం నాకు సంతోషం అనిపిస్తుంది. రాత్రి పగలు కష్టపడి చదివి తప్పకుండా పోలీస్ ఉద్యోగం సాధిస్తా.
– రాయిచెట్టు శ్రీపాల్, కొత్తగూడ
ప్రతి రోజూ కష్టపడుతున్నా..
ఎన్నో రోజుల నుంచి పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. నోటిఫికేషన్ రావడంతో సాధనను ముమ్మరం చేస్తాను. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రతి రోజూ కష్టపడుతున్నా. ఫిజికల్ ఫిట్‌నెట్, రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ఉద్యోగం సాధిస్తా. ఒకేసారి 16వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పెద్దింటి దుర్గా, మేడ్చల్
ఈ సారి నమ్మకం ఉంది
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన రోజు నుంచే సాధన ప్రారంభించాను. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సారి ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగం సాధించాలనే తపనతో ఉన్నాను.
– శ్రీకాంత్, కుత్బుల్లాపూర్
గృహిణిగా ఉన్నా.. కానిస్టేబుల్ సాధిస్తా..
2015లో బికాం పూర్తి చేశాను. ఆ తర్వాత జీవనోపాధి కోసం ప్రైవేట్ ఉద్యోగాలు చేశా. పెళ్లయ్యాక గృహిణిగా స్థిరపడ్డాను. చిన్నప్పటి నుంచి పోలీసు జాబ్ చేయాలని ఉంది. పోలీసులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్న సమాచారం తెలుసుకొని ఇక్కడకు వచ్చాను. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తాను.
– ఆశా ఠాకూర్, దత్తాత్రేయకాలనీ, ఆసిఫ్‌నగర్
నాన్నే స్ఫూర్తి.. పోలీసవుతా..
నేను బికాం పూర్తి చేశాను. నాన్న రిటైర్డ్ ఏఎస్సై. చిన్నప్పటి నుంచి యూనిఫామ్‌లో నాన్న చూస్తూ పెరిగా.. ఎప్పటికైనా పోలీసు శాఖ చేరాలన్నదే నా లక్ష్యం. అందుకే ఈ శిక్షణకు వచ్చాను. పోలీసు అధికారుల ఉపన్యాసాలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఉద్యోగం సాధించి తీరుతానన్న విశ్వాసం కలిగింది.
– ఖాజా ఇష్రార్ అలీ, షాహినయత్‌గంజ్
నాన్న కోరిక.. ఎస్ఐ అవుతా..
మా నాన్న కానిస్టేబుల్. నాకు తల్లి, నలుగురు సోదరులు, ఒక అక్క ఉన్నారు. మా నాన్న ఇటీవల కొవిడ్ కారణంగా మరణించారు. నేను భరోసా షీ టీమ్స్‌లో ఆర్నెళ్లుగా పని చేస్తున్నాను. మా నాన్న కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సాధిస్తా. ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే పోలీసు శాఖ ఉచిత శిక్షణ హాజరయ్యాను.
– కిరణ్ జ్యోతి, ధూల్‌పేట్
ప్రిపరేషన్‌కు టైమ్ ఇవ్వాలి
నేను అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాను. పోలీస్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. షెడ్యూల్ ప్రకారం గడువిస్తూ భర్తీ చేయాలి… అప్పడు అందరికీ న్యాయం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే భర్తీ చేస్తే సీనియర్లు మాత్రమే ఉద్యోగాలను సాధిస్తారు. ప్రిపరేషన్‌కు తప్పకుండా సమయం ఇవ్వాలి.
– డి. అభిజ్ఞ, మంచిర్యాల
ప్రభుత్వానికి రుణపడి ఉంటాను
పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. సైబరాబాద్ పోలీసులు అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. పోలీస్ ఉద్యోగం సాధించి తీరాలన్నదే తన లక్ష్యం. – భాను, ఫతేనగర్ నివాసి