సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్‌ను తలదన్నేలా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రమంలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి రూ.1.5కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా ఖరీదైన కొలనోస్కోపి, ఎండోస్కోపి, పరీక్షల కోసం కొలనోస్కోప్ యంత్రం, అత్యాధునిక ఒలంపస్-190సిరీస్ అప్పర్ జీఐ తదితర పరికరాలను వైద్య, ఆరోగ్యశాఖ సమకూర్చింది. దీంతో నిరుపేద రోగులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలుగనుంది.
ప్రతిరోజు గాంధీకి గ్యాస్ట్రోకు సంబంధించి 150 నుంచి 200మంది వరకు రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రతి రోజు 30 మంది గ్యాస్ట్రో విభాగంలో ఐపీ సేవలు పొందుతుంటారని తెలిపారు. ఓపీ రోగుల్లో ప్రతి రోజు కనీసం 10శాతం మందికి కొలనోస్కోపి తదితర పరీక్షలు, 50 శాతం మందికి ఎండోస్కోపి పరీక్షలు అవసరం పడుతుంటాయి. ఎండోస్కోపి పరీక్షకు బయట రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు, కొలనోస్కోపి పరీక్షకు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతుంది. అత్యాధునికమైన వైద్యపరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రజలపై ఆర్థిక భారం తప్పనుందంటున్నారు వైద్యనిపుణులు
పరీక్షలతో పాటు ప్రొసీజర్స్ కూడా చేయవచ్చు
గాంధీ దవాఖానలో సమకూర్చిన 190 సిరీస్ అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోప్, సైడ్ వీవింగ్ ఎండోస్కోప్ తదితర పరికరాలతో వైద్యపరీక్షలే కాకుండా కొన్ని రకాల ప్రొసీజర్స్ కూడా చేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు. పేగులు, జీర్ణాశయం తదితర వాటిపై ఏర్పడే పాలిక్స్, చిన్నపాటి ట్యూమర్స్‌ను తొలగించాలంటే గతంలో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పుడున్న పరికరాలతో అతి తక్కువ సయమంలో ఎలాంటి కోత లేకుండానే ఒక పక్క వైద్య పరీక్షలు చేస్తూనే మరో పక్క పాలిక్స్, ట్యూమర్స్‌ను తొలగించవచ్చని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా రక్తస్రావం అయ్యే రక్తనాలాలను ఈ అత్యాధునిక ఎండోస్కోపి, కొలనోస్కోప్తో కట్‌చేసి, మూసివేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు. అంటే ఈ ఆధునిక పరికరాలు అటు వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
అత్యాధునిక చికిత్స
కార్పొరేట్ దవాఖానల్లో కేవలం 10శాతం హాస్పిటల్స్‌లోనే ఇలాంటి ఆధునిక పరికరాలు ఉన్నాయి. గాంధీ దవాఖానలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చుతోంది. దీని వల్ల రోగి ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా గుర్తించడమే కాకుండా శస్త్రచికిత్సలకు లైన్ క్లియర్ చేసే వీలుంటుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
యాంటీ మైక్రోబియల్ అవగాహన సదస్సు
బన్సీలాల్‌పేట్, నవంబర్ 21: ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా గాంధీ వైద్య కళాశాల, దవాఖానలోని మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ శేఖర్, గైనకాలజీ విభాగం హెచ్‌వోడి ప్రొఫెసర్ సంగీత షాలు సదస్సుకు చైర్పర్సన్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమ్య, డాక్టర్ మణిపాల్, డాక్టర్ అర్చన, డాక్టర్ పద్మజ పలు కీలక అంశాలపై ప్రసంగించారు. దవాఖానలలోని ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, ఎమర్జన్సీ చికిత్సా విభాగాల వద్ద హానికారక బ్యాక్టిరియాను నివారించాలని వారు సూచించారు. మైక్రోబయాలజీ విభాగం హెచ్‌వోడి డాక్టర్ ఎస్.రాజేశ్వరరావు, ఆప్తల్మాలజీ విభాగం హెచ్‌వోడి డాక్టర్ రవిశేఖర్, ఇతర ఎస్ఆర్, పీజీలు పాల్గొన్నారు.
ఇరవై ఏండ్లలోపు పిల్లల్లోనూ టైప్ 1 డయాబెటిస్
గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
బన్సీలాల్‌పేట్, నవంబర్ 21: 20 ఏండ్లలోపు పిల్లలు, యువకులు టైప్-1 డయాబెటిస్ బారిన పడుతున్నారని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నోవో నార్డిస్క్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ దవాఖానాలో ‘సెంటర్ ఫర్ ఎక్సెలెన్సీ’ కేంద్రాన్ని ఆయన ఓ బాలుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైప్ -1 డయాబెటిస్‌ను నియంత్రించే విధంగా జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు.
గాంధీ దవాఖాన ఎండోక్రైనాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ వినయ్ శేఖర్ మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. ‘నోవో నార్డిస్క్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ మేనేజింగ్ ట్రస్టీ విక్రాంత్ శ్రోత్రియ మాట్లాడుతూ మన దేశంలో 74.2 మిలియన్ ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని, తాజా లెక్కల ప్రకారం 20 ఏండ్లలోపు వయసున్న 2, 20,000 మంది టైప్1 బారిన పడ్డారని వెల్లడించారు. ఇలాంటి వారిపై పరిశోధన చేయడానికి గాను తమ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది చిన్నారులకు సహాయ సహకారాలను అందిస్తున్నదని తెలిపారు.
ఒలంపస్ 190సిరీస్ అప్పర్ జిఐ
కొలనోస్పోప్ సైడ్ వీవింగ్ ఎండోస్కోపి
ఫుజినాన్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్