పోలీసు ఉచిత శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులకు భరోసా
సైబరాబాద్ పరిధిలో 3330 మందికి కోచింగ్..
ప్రిలిమ్స్ కోసం 11 సబ్జెక్ట్‌లలో బోధనలు
గ్రామీణ యువతపై పోలీసుల ప్రత్యక ఫోకస్
సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ్యలో వదిలేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన సైబరాబాద్ పోలీసు అధికారులు ఇప్పుడు ఆ గ్రామాల యువతను పోలీసు అధికారులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లోని యువతకు పోలీసు శాఖ తరపున ప్రభుత్వం సహకారంతో శిక్షణను అందిస్తున్నారు.
3330 మంది దరఖాస్తు..
సైబరాబాద్ పరిధిలో పోలీసు ఉద్యోగాల్లో చేరాలనుకున్న యువతీ,యువకులు మొత్తం 3330 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శంషాబాద్ జోన్- 2030, మాదాపూర్ జోన్- 300, బాలానగర్ జోన్-1000 మంది ఉచిత కోచింగ్‌కు వస్తున్నారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విభజించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు…మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నారు. 11 సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో క్లాసులు ఇస్తున్నారు. ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈవెంట్స్, మెయిన్స్ కోసం ప్రత్యేక శిక్షణను ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 20 మంది అభ్యుర్థులను ఒక స్కాడ్‌గా ఏర్పాటు చేసి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి ఈ వెంట్స్‌లో ఉండే రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్ ఇతర అంశాల్లో శారీరక శిక్షణను ఇవ్వనున్నారు. ఆ తర్వాత మెయిన్స్‌కు సంబంధించిన పరీక్షలకు కూడా ప్రత్యక ప్లానింగ్‌ను పోలీసు అధికారులు రూపొందించారు. ఈ అభ్యర్థులకు స్ఫూర్తి నింపేందుకు 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వారితో కూడా పోలీసులు తరగతులు నిర్వహిస్తున్నారు.
డబ్బులు లేక ఉద్యోగం వద్దనుకున్నా..
మాది కవాడిగూడ. బీటెక్ చదివాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలని ఉన్నా శిక్షణకు ఆర్థిక స్తోమత లేక వదిలేద్దామని అనుకున్నా. నా స్నేహితురాలు పోలీసు ఉచిత శిక్షణ గురించి చెప్తే సీతారాంబాగ్‌లో పోలీసు ఉచిత శిక్షణ శిబిరంలో చేరాను. వారు అందించిన కోచింగ్‌తో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్‌లో విజయం సాధించి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం సైబరాబాద్ కమ్యూనికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నా. – మనీశా, కానిస్టేబుల్
శిక్షణతోనే విజయం సాధించా..
మాది యాదాద్రి జిల్లా కంచనపల్లి గ్రామం. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటూ డిగ్రీ చేశాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కన్నా. 2018లో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. కోచింగ్ వెళ్లాలంటే డబ్బులు లేవు. పోలీసు కోచింగ్ గురించి తెలుసుకుని అందులో చేరాను. వారి అందించిన శిక్షణతో విజయం సాధించాను. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఐటీ సెల్ విభాగంలో పని చేస్తున్నా.
– ప్రణయ్, కానిస్టేబుల్
మా శిక్షణ పొందండి, విజేతలుగా నిలవండి
ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. దీని కోసమే సైబరాబాద్ పరిధిలో అధిక గ్రామీణ ప్రాంతాలు ఉండడంతో అక్కడ నివాసం ఉండే యువతను పోలీసు శాఖలో ఉద్యోగం సాధించేలా వారికి నిష్ణాతులైన ఫ్యాకల్టీ, మాజీ, సీనియర్ పోలీసు అధికారులతో శిక్షణలను ఇప్పించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించాం. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ కోసం అభ్యర్ధులను సన్నద్ధం చేస్తున్నాం. అందరీ సహకారం తీసుకుని వారిని విజేతలుగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
– స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీసు కమిషనర్