కవాడిగూడ, అక్టోబర్ 7: ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ అప్డేట్ చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌తో ధర్మసమాజ్ పార్టీ మద్దతుతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్, వి.జి.ఆర్.నారగోని తదితర సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెలించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా యాజమాన్యాలను భయాందోలనలకు గురిచేస్తుందని, కళాశాలలను బంద్ చేస్తామని రకరకాల కొర్రీలు పెడుతూ యాజమాన్యాలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంతటి దుర్మార్గపు సీఎం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడని అన్నారు.
తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయంబర్స్మెంట్ను వెంటనే చెలించాలని, పాత పద్ధ్దతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను దిగ్భందనం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ సాధించుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అగ్రకులాలకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతుబందుకు, మెట్రోరైలుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మా విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించేందుకు డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారధన్ మాట్లాడుతూ అనగారిన వర్గాల పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని ఆందోళనలు చేపట్టిన కళాశాలల యాజమాన్యాలపైకి విజిలెన్స్ అధికారులను పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్రముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కమాల్, రాసాల వినోద్‌యాదవ్, రాముయాదవ్, పూసల సాయిబాబా, బాలయ్యముదిరాజ్, మల్లయ్య, రాంబాబుచారి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.