ఆరోగ్యశాఖలో అవినీతి దందా
- డిప్యుటేషన్ ముసుగులో పోస్టులు అమ్ముకుంటున్నరు
- సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ బదిలీ
- మూడు నెలలకే మళ్లీ డిప్యుటేషన్‌పై వచ్చి బాధ్యతలు
- సనత్‌నగర్ టిమ్స్‌లో సైతం
- పెద్ద ఎత్తున అక్రమాలు
- భగ్గుమంటున్న తెలంగాణ వైద్యాధికారులు
‘తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆగమైపోతోంది. డిప్యుటేషన్ ముసుగులో పోస్టులు అమ్ముకుంటున్నారు. నిబంధనలు లేవు పాడు లేవు. డబ్బులిస్తే ఆ శాఖలో ఏదైనా సాధ్యమే.. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. మినిస్టర్ పేషీ, హెల్త్ సెక్రెటరీ దగ్గర నుంచి డీఎంఈ, డీహెచ్ ఇలా ఏ విభాగాలను కదిలించినా అవినీతి, అక్రమాల వైరస్లు దడ పుట్టిస్తున్నాయి. ఏ ఒక్క నిబంధన సరిగ్గా పాటించడం లేదు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రోజు రోజుకు అక్రమాలు, అవినీతితో దిగజారిపోయి వెంటిలెటర్ మీదకు వస్తోంది’ అంటూ వైద్యలోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పై నుంచి కింద వరకు ఎవరికి వారు ఎంత దొరికితే అంత దోచుకు తింటున్నారని స్వయాన సొంత వైద్య సిబ్బందే ఆరోపిస్తున్నారు. చెయ్యి తడపనిదే ఫైళ్లు కదలడం లేదని, మూటలు ముట్టజెప్పినోళ్లకి కోరుకున్న చోట పోస్టింగ్‌లు, ఆర్థిక స్థోమత లేక ముడుపులు చెల్లించనోళ్లకి దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ నియామకమే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మూడు నెలల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారుల బదిలీలు జరిగాయి.ఈ బది‘లీలలు’ల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సరోజినీ దేవి కంటి దవాఖానలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన డా.మోదిని సాధారణ బదిలీల్లో భాగంగా మూడు నెలల క్రితమే నల్గొండ మెడికల్ కళాశాలకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో నల్గొండ నుంచి డా.సాంబశివారెడ్డికి సరోజిని దేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎవరు చక్రం తిప్పారో, ఎంత బరువు తూగిందో తెలియదు గాని మూడు నెలలు గడవగానే నల్గొండకు బదిలీ అయిన డా.మోదిని మళ్లీ సరోజిని దేవి కంటి దవాఖానకు డిప్యుటేషన్‌పై వచ్చారు.
వైద్య చరిత్రలోనే తొలిసారిగా..
వైద్య చరిత్రలోనే తొలిసారిగా డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారికి సూపరింటెండెంట్ పగ్గాలు అప్పగించడంపై యావత్ తెలంగాణ వైద్యాధికారులు భగ్గుమంటున్నారు. ఆరు నెలల వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఉండవని ఇటీవల జారీచేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ వారు జారీచేసిన నిబంధనలను వారే తుంగలోకి తొక్కడంపై వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. బదిలీ అయిన మూడు నెలల్లో మళ్లీ డిప్యుటేషన్ ఇవ్వడం ఒక తప్పు అయితే, వర్క్ డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారికి సూపరింటెండెంట్ పోస్టును ఎలా కట్టబెడతారని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చరిత్రలోనే ఇలా ఎన్నడూ జరగలేదని, డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు, లేదా సిబ్బందికి సాధారణ పోస్టులు అప్పగిస్తారని, ఇలా పరిపాలన పరమైన కీ పోస్టులను అప్పగించడం ఇంతవరకు తాము కనీవిని ఎరగమంటున్నారు వైద్యులు.
ఒక వేళ ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్‌పై ఏవైనా ఆరోపణలు లేదా ఇతరాత్ర అంశాలు ఏమైనా ఉంటే ఆయనను తప్పించి ఆ తరువాత ఉన్న సీనియర్ అధికారికి సూపరింటెండెంట్ పోస్టును అప్పగించాలి తప్పా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అటు పాలకులు, ఇటు ఉన్నతాధికారులు తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ రోగులను, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైద్యులు మండిపడుతున్నారు.
మొన్న నర్సింగ్ ..నేడు వైద్యులు
ఇటీవల జరిగిన నర్సింగ్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు బాధిత నర్సింగ్ అధికారులు ఏకంగా డీహెచ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత పారామెడికల్, టెక్నికల్ తదితర నాన్ క్లినికల్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో సైతం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిఇలా ఉంటే వైద్యుల బదిలీలు, పోస్టింగ్‌లలో సైతం అక్రమాలు చోటుచేసుకున్నట్లు వైద్యాధికారులు కొంత కాలంగా గుర్రుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నియామకంపై కూడా కొంత కాలంగా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి.
అదనపు డీఎంఈ హోదా గల అధికారిని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌గా నియమించాలనేది నిబంధన. కాని ప్రస్తుతం ఉన్న అధికారికి అదనపు డీఎంఈ హోదా లేదు. ఆ హోదా ఉన్న అధికారులు ఎంతో మంది ఉన్నా కూడా ఉస్మానియా సూపరింటెండెంట్ పోస్టును అర్హులైన అధికారులతో భర్తీ చేయకపోవడం, కొన్ని రోజుల క్రితం వనపర్తి వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు కల్పించి, ఉత్తర్వులు జారీచేసిన మరుసటి రోజే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. టిమ్స్ నియామకాల్లో సైతం పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి.
సనత్‌నగర్ టిమ్స్‌లో కీలక పదవులన్నీ ఇటీవల పదవీ విరమణ చేసిన వారికే కేటాయించడంపై ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న సీనియర్ వైద్యులు మండిపడుతున్నారు. సర్వీస్‌లో ఉన్న అధికారులను నిమ్స్‌కు కేటాయించకుండా పదవీ విరమణ పొందిన అధికారులకు పోస్టులు కట్టబెట్టి, వారికి లక్షల రూపాయల వేతనాలు చెల్లించడంతో ప్రజా ధనం వృథా అవుతుందని ఇన్‌సర్వీస్ వైద్యాధికారులు వాపోతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖలోని అత్యున్నత స్థాయి అధికారి అనాలోచిత నిర్ణయాలు, మంత్రి పేషీలోని కొందరు వసూళ్లరాయుళ్లు, పెట్టుబడితో పోస్టులను సొంత చేసుకున్న కొందరు అధికారులు, మధ్యవర్తిత్వం వహించే కొందరు బ్రోకర్లతో తెలంగాణ ఆరోగ్యశాఖ అవినీతి వైరస్‌కు గురై, వెంటిలెటర్‌పై మూలుగుతోందని స్వయాన ఆ శాఖ అధికారులు, సిబ్బందే మండిపడతుండటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

