జడలు విప్పిన అవినీతి!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల పాటు హెచ్ఎండీఏలో ఒక్క ఫైలుకూ మోక్షం కలగలేదు.
- భూ స్కామ్‌లకు కేంద్రంగా మారిన మహా నగరాభివృద్ధి సంస్థ
- నగర విస్తరణ, అభివృద్ధిని గాలికొదిలేసి స్వామికార్యంలో నిమగ్నం
- మాస్టర్‌ప్లాన్ రహదారులు మొదలు ప్లాట్ల వేలం వరకు అంతా కరప్షనే
- ముఖ్యనేత కోటరీ చేతుల్లో కీలుబొమ్మగా హెచ్ఎండీఏ
హెచ్ఎండీఏ.. చారిత్రక నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాల్సిన విభాగం. కేసీఆర్ హయాంలో సుమారు రూ.25వేల కోట్ల పైచిలుకు నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పించడంలో విశేషంగా కృషి చేసింది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు నగరాన్ని ప్రశంసించడంలో హెచ్ఎండీఏ పాత్ర కూడా ఉంది. ఇలాంటి కీలకమైన సంస్థలో అవినీతి జడలు విప్పుతున్నది.
మూడేండ్లుగా క్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం సర్కారు పెద్దల సేవలోనే తరిస్తున్న ఈ సంస్థ ప్రధానంగా ‘ముఖ్య’నేత కోటరీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ భుత్వం వచ్చి దిలోనే బెంగళూరు తరహా టాక్స్ వసూలు కేంద్రంగా మారిందనే విమర్శలు మొదలు..మాస్టర్‌ప్లాన్ రోడ్లను ఇష్టానుసారంగా మార్చి ప్రభుత్వ పెద్దల రియల్ వ్యాపారం కోసం సామాన్యుడిని సైతం బలి చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు వెనుకంజ వేయడంలేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ భూములను వేలం వేయడంలో ఉమ్మడి ఏపీ నుంచి కేసీఆర్ హయాం వరకు పారదర్శకత, సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన హెచ్ఎండీఏ.. వేలం ప్రక్రియను సైతం అధికారులు భ్రష్టుపట్టించడం గమనార్హం. మూడేండ్లుగా బయటికొచ్చిన అవినీతి, అవకతవకలు పిడికెడు మాత్రమే కాగా.. వెలుగులోకి రానివి పుట్టగొడుగుల్లా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గుండాల కృష్ణ, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల పాటు హెచ్ఎండీఏలో ఒక్క ఫైలుకూ మోక్షం కలగలేదు. కొత్తవి కూడా పక్కన పెట్టడం తప్ప.. కనీసం పరిశీలించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రియల్ రంగంలో మొదలైన గుబులు.. బెంగళూరు తరహా టాక్స్. ఇందుకు వేదికగా మారింది హెచ్ఎండీఏనే.
‘ముఖ్య’నేత కోటరీలో కీలకమైన వ్యక్తులు చెబితే తప్ప మహా నగర పరిధిలో భారీ లేఅవుట్లు… ఆకాశహర్మ్యాలకు అనుమతులు రావడంలేదని రియల్ ప్రముఖులే సహచరుల దగ్గర వాపోయిన దుస్థితి. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో పెద్ద ఎత్తున రియల్ రంగం నుంచి వసూళ్లు మొదలయ్యాయని, అనుమతుల కోసం చదరపు అడుగుకు రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని అనేక మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో బెంగళూరు తరహాలో తెలంగాణలోనూ ఇక్కడ కూడా ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల పాటు హెచ్ఎండీఏలో ఒక్కటంటే ఒక్క ఫైలుకు కూడా మోక్షం కలగలేదు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్నవే కాదు.. కొత్త దరఖాస్తులను సైతం అధికారులు పక్కన పెట్టడం తప్ప కనీసం వాటిని పరిశీలించి, షార్ట్‌ఫాల్స్ అడిగిన దాఖలాలు లేవు.
అనేకమంది బిల్డర్లు, రియల్టర్లు వెళ్లి అడిగినా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే వరకు దరఖాస్తులు ముందుకు కదలవని అధికారులే పలానా వాళ్లను కలవాలంటూ సూచించే పరిస్థితి ఏర్పడిందనేది అప్పట్లో రియల్ వర్గాల్లో బహిరంగంగానే జరిగిన చర్చ. దీంతో సదరు వ్యక్తుల్ని కలిస్తే చదరపు అడుగుకు రూ.150 చొప్పున అంగీకరిస్తే తప్ప.. అనుమతులు రావడంలేదని అనేక మంది బహిరంగంగానే ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందు ఆర్ ఆర్ టాక్స్ గుట్టు రట్టు చేశారు.
దీంతో ఉలిక్కిపడిన అధికారులు బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన టీఎస్ బీపాస్ పోర్టల్‌లో లోపాలున్నాయని, వాటిని సరి చేసేందుకే అనుమతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. కానీ ఆర్నెల్ల వరకు నిలిచిన ప్రక్రియ ఆతర్వాత సదరు వ్యక్తుల కనుసన్నల్లో పునరుద్ధరణ జరిగింది. ఆపై ఏడాది తర్వాత టీఎస్ బీపాస్ స్థానంలో బిల్డ్‌నౌ తీసుకువచ్చారు.
అంటే ఆర్నెల్ల పాటు అనుమతుల ప్రక్రియ నిలవడం వెనక అసలు కారణం సాంకేతికత, టీఎస్ బీపాస్లోని లోపాలు కావనేది అందరికీ అర్థమైంది. చివరకు భారత ప్రధాని సైతం తెలంగాణలో ఆర్ ఆర్ టాక్స్‌పై వ్యాఖ్యలు చేశారంటే హెచ్ఎండీఏలో అనుమతలు ప్రక్రియ ఎంత అవినీతిమయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
‘ముఖ్య’ నేత చెప్పిన వారికే గ్రీన్‌ఫీల్డ్ టెండర్లు

కేవలం అనుమతుల ప్రక్రియనే కాదు… హెచ్ఎండీఏ చేపట్టిన టెండర్లలోనూ అవినీతి రాజ్యమేలిందనేందుకు అనేక ఉదాహరణలు. ‘ముఖ్య’నేత చెప్పిన వారికే టెండర్లు దక్కడంతో చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యే సైతం హైకోర్టును ఆశ్రయించి… బహిరంగంగా టెండర్ల భాగోతంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) విభాగం కేంద్రంగా జరుగుతున్న ప్రాజెక్టులు, పనుల కేటాయింపుల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించారు.
రూ. 2,300 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు టెండర్ల వెనుక ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నచ్చిన కాంట్రాక్టర్లకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. అవుటర్ రింగు రోడ్డు ఆదిబట్ల ఎగ్జిట్-13 నుంచి ఫోర్త్ సిటీ మీదుగా ఆకుతోటపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఆదిబట్ల ఎగ్జిట్-13 నుంచి ఫోర్త్ సిటీ వరకు పనులు చేపట్టేందుకు నిర్ణయించి… దానిని రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.
అయితే ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏపీకి చెందిన సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే టెండర్లు దక్కేలా ‘ముఖ్య’నేత ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఎల్ అండ్‌టీ కంపెనీ కూడా ఈ టెండర్లలో పాల్గొనడంతో ఏకపక్షంగా రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రెండు ప్యాకేజీలు కట్టబెట్టడం కుదరకపోవడంతో ఒక ప్యాకేజీని ఆ కంపెనీకి ఇచ్చి మరో ప్యాకేజీని ఎల్అండ్టీకి ఇచ్చారనే వ్యాఖ్యలు వినిపించాయి.
మొత్తంగా టెండర్ల ప్రక్రియ ఆద్యంతం అవతవకలమయం అనే విమర్శలు వచ్చాయి. దీంతో పాటు బుద్వేల్ రేడియల్ రోడ్డు టెండర్ల వ్యవహారం కూడా వీధినపడింది. . సీఎం కార్యాలయం ముందే కుమ్మకై తమకు కావాల్సిన కంపెనీలకే టెండర్లు కట్టబెట్టేలా పావులు కదిపిందని, మిగతా కాంట్రాక్టర్లు పోటీ పడకుండా సీఎం కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్వీఎం నిర్మాణ సంస్థ ఎండీ నామా రమేశ్ బహిరంగంగా ఆరోపించారు.
అంతకుముందు ఈ టెండర్ల అవకతవకలపై స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. అర్హత ఉన్న సుశీ ఇన్ఫ్రాను కావాలనే సాంకేతిక పరిశీలనలో తప్పించారని, తద్వారా పోటీ లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 600 కోట్ల నష్టం వాటిల్లుతోందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ కమిషనర్, హెచ్‌జీసీఎల్ అధికారుల పాత్రపై ఇప్పుడు తీవ్ర చర్చ జరిగింది.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ‘బిగ్’ రహదారులు
సాధారణంగా పట్టణాభివృద్ధిలో మాస్టర్ ప్లాన్స్ అనేవి కీలకమైనవి. పైగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే అమలులోకి తెచ్చిన మాస్టర్‌ప్లాన్-2031 ఇప్పటికీ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్‌ప్లాన్-2031ను హెచ్ఎండీఏ బిగ్ బ్రదర్స్ చేతుల్లో పెట్టిందనే తీవ్ర విమర్శలున్నాయి.
ఇందుకు మంచిరేవుల, నార్సింగి గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా, దారి తప్పిన వంద ఫీట్ల రహదారుల ప్రతిపాదనలే నిదర్శనం. అయితే వెలుగులోకి వచ్చినవి ఈ రెండు మాత్రమే. కానీ ఇంకా అమీన్పూర్, కొల్లూరు, తెల్లాపూర్ పరిధుల్లోనూ అనేక రహదారుల అలైన్మెంట్లను మార్చారనే సమాచారం బయటికొస్తుంది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్-2031లోని వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను మార్చడంలో ‘బిగ్’ హస్తం ఉంది. ఈ విషయాన్ని కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె కూతురు సుస్మితా పటేల్ బహిరంగంగా చెప్పారు. మంత్రి విల్లాస్‌కు ఆనుకొని ఉన్న దేవాదాయ భూముల్లో నుంచి ఒక రియల్టర్‌కు చెందిన భూములకు ప్రయోజనకరంగా ఉండేలా వంద ఫీట్ల రోడ్డును వేయడంలో మంత్రి వర్సెస్ బిగ్ బ్రదర్స్‌గా వ్యవహారం నడిచింది.
వాస్తవానికి ఇది దేవాదాయ, రెవెన్యూ శాఖకు చెందిన అంశం కాగా… చివరకు దానిని అటు తిప్పి ఇటు తిప్పి హెచ్ఎండీఏ కోర్టులో బంతి వేసి బిగ్ బ్రదర్స్ ఇష్టానుసారంగా మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్డును అష్టవంకరలు తిప్పారు. 2004లో అవుటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్డు నుంచి మంత్రి విల్లాస్ వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వంద ఫీట్ల రహదారిని నిర్మించింది. ప్రజా ప్రయోజనాల కోసమైతే హెచ్ఎండీఏ దీనిని పొడగిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ హెచ్ఎండీఏ కీలుబొమ్మగా మారడంతో బిగ్ బ్రదర్స్ దానిని అక్కడికే డెడ్ఎండ్గా చేసి మరో అలైన్‌మెంట్‌ను రూపొందించారు.
దీనికి అధికారిక ముద్ర వేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు జిమ్మిక్కులు ప్రదర్శించారు. తొలుత రెండు పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేసి కేవలం వారం రోజుల్లోనే గెజిట్ ప్రచురించారు. నిబంధనల మేరకు గడువు వరకు ఆగకుండా, అభ్యంతరాలు స్వీకరించకుండా పత్రికల్లో వచ్చిన సర్వేనెంబర్లకు భిన్నంగా గెజిట్‌లో మరో సర్వే నంబరును ఇచ్చారు. ఇదేమంటే టైపోగ్రాఫికల్ ఎర్రర్ (టైపింగ్ మిస్టేక్) అని అధికారులే స్వయంగా అంగీకరించడం గమనార్హం.
మాస్టర్‌ప్లాన్-2031 ప్రకారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామ పరిధిలో అలేఖ్య టవర్స్ నుంచి పలు సర్వేనెంబర్ల మీదుగా మంచిరేవుల గ్రామ పరిధిలోకి వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించారు. అయితే ఈ రోడ్డు సర్వేనెంబరు 126లోని 400 ఏండ్ల చరిత్ర ఉన్న హనుమాన్ దేవాలయం మీదుగా ఉందంటూ స్థానికుల నుంచి పెద్ద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో కేవలం ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తూ గెజిట్ జారీ చేసింది.
అయితే రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ మొత్తం మాస్టర్‌ప్లాన్ రోడ్డును ఇష్టానుసారంగా మార్చారనేది స్థానికులు చేస్తున్న బహిరంగ ఆరోపణ. ముందుగా అక్కడి భూముల యజమానులతో చేసుకున్న డెవలప్మెంట్ అగ్రిమెంట్స్, ముందుగానే కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్స్‌కు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రోడ్డును మార్చడంతో ఇదే హెచ్ఎండీఏ అనుమతులతో నిర్మించిన, నిర్మిస్తున్న అనేక అపార్టుమెంట్లు అడ్డంగా కూల్చివేతకు గురవుతున్నాయి.
ఇవన్నీ పట్టించుకోని హెచ్ఎండీఏ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ అందుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రోడ్డు మార్పు కోసం గెజిట్ జారీ చేయడంతో వందలాది మంది సామాన్యుల ఫ్లాట్స్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా 7హిల్స్ అపార్టుమెంటులో ఏకంగా 850కి పైగా కుటుంబాలు నిలువనీడ కోల్పోయే దుస్థితి వచ్చింది.
సర్కారు ఆదేశాలూ బేఖాతరు…

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో నిర్మించిన సాస్ ఐటవర్ విషయంలోనూ హెచ్ఎండీఏ సర్కారు ఆదేశాలను భేషుగ్గా బేఖాతరు చేసింది. 2019లో జీహెచ్ఎంసీ సాస్ ఐటవర్కు జీ+36కు అనుమతినివ్వగా… గత ఏడాది నవంబరులో ఆ కంపెనీ సవరణ నిర్మాణ అనుమతులకు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఏడాది మే నెలలో జీహెచ్ఎంసీకి సుమారు రూ.15 కోట్ల జరిమానా చెల్లించింది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు పది అంతస్తులు దాటిన నిర్మాణాలకు హెచ్ఎండీఏనే అనుమతులు, ఓసీలు ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకుంటే ఏ సంస్థలకు వచ్చిన దరఖాస్తుల్ని ఆ సంస్థలే ఇవ్వాలని అందులో స్పష్టంగా ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ఈ ఏడాది జూన్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెరా చట్టాలను ఉల్లంఘించి సవరణ నిర్మాణ అనుమతులు జారీ చేసింది. అదే బాటలో హెచ్ఎండీఏ ఆగస్టులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేసింది. నిబంధనల మేరకు సవరణ నిర్మాణ అనుమతులు వచ్చిన తర్వాత ఆ మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది.
కానీ సీఎంసీ అనుమతులు ఇచ్చిన కేవలం రెండు నెలల్లోపే సుమారు లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తయినట్లుగా హెచ్ఎండీఏ అధికారులు ఓసీ జారీ చేశారు. చివరకు ఇప్పుడు కూడా అక్కడ లిఫ్టులు, జనరేటర్లు, ఇతరత్రా సౌకర్యాలు ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ అధికారులు నాలుగు గోడల మధ్య ఓసీ జారీ చేశారంటే తెర వెనక ఏం జరిగి ఉంటుందనేది బహిరంగ రహస్యమే.
కోటరీకి సొంత ఆస్థానంలా హెచ్ఎండీఏ
నానాటికీ విస్తరించే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేలా మౌలిక వసతుల కల్పన, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి వంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ గత రెండున్నర సంవత్సరాలుగా బిగ్ బ్రదర్స్ ఆస్థానంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో చివరకు హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం ప్రక్రియను సైతం అవినీతిమయం చేశారనేందుకు ఇటీవలనే ఓ ఆధారం వెలుగులోకి వచ్చింది.
నార్సింగి గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 103లో 1.07 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా వేలం నిర్వహించి ఓ రాయలసీమ రియల్టర్‌కు చెందిన కంపెనీకి దక్కేలా పావులు కదిపారనేది బహిరంగ రహస్యం. 2,420 చదరపు గజాలను ఈ ఏడాది ఆగస్టులో హెచ్ఎండీఏ వేలం వేసింది. కనీస ధర చదరపు గజానికి రూ.75వేలుగా నిర్ధారించింది. ఇక్కడ చదరపు గజం రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల వరకు ఉండగా అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ అనే కంపెనీ రూ.80వేల కోట్ చేసి బిడ్ దక్కించుకుంది. అంటే వంద ఫీట్ల రహదారి సౌకర్యం ఉన్న రూ.40-50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19.36 కోట్లకు దక్కించుకున్నారు.
అదేవిధంగా సర్వేనెంబరు 105లోనూ 1.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్త అలైన్‌మెంట్‌ను ఈ భూమికి ముందుగా రూపొందించారు. తర్వాత హెచ్ఎండీఏ 5687 చదరపు గజాలకు వేలం నిర్వహించగా… అదే అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ చదరపు గజం కేవలం రూ.47వేలకే దక్కించుకుంది. అంటే ఇక్కడ రూ.85-110 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.26.72 కోట్లకు దక్కించుకున్నారు. అయితే ఈ వేలం ఎప్పుడు నిర్వహించారు.. కనీస ధర ఎంత అనేది ప్లాటు కేటాయింపు ఉత్తర్వుల్లోనూ అధికారులు పొందుపరచలేదంటే హెచ్ఎండీఏ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
చెరువుల్లో విల్లాలు నిర్మించినా..
వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ ఆ సంస్థ బాధ్యత. ఇప్పుడు హైడ్రా వచ్చినప్పటికీ బాధ్యత హెచ్ఎండీఏ అధికారులపైనా ఉంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ్ గ్రామ పరిధిలో అంబుజా సంఘీ సామ్రాట్ విల్లా ప్రాజెక్టులో భాగంగా చిన్న చెరువును సమాధి చేశారంటూ నీటిపారుదల శాఖ అధికారికంగా నివేదిక ఇచ్చినా హెచ్ఎండీఏ చీమకుట్టినట్లుగా కూడా లేదు.
హెచ్ఎండీఏ నోటిఫై చేసిన చిన్న చెరువు (ఐడీ నెంబరు 1962) ఎంఎఫ్ఎల్ (గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం), బఫర్‌జోన్ విస్తీర్ణంలో ఏకంగా ఏడు విల్లాలు, పదకొండు పిల్లర్లు, ఒక ప్రహరీగోడ, ఒక కార్యాలయ భవనం ఉన్నట్లుగా అధికారిక సర్వేలోనే తేలింది. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్ తహసిల్దార్ నివేదికను ఉటంకిస్తూ వెంటనే ఆ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలని ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హెచ్ఎండీఏ అధికారుల్లో ఉలుకూ లేదు పలుకూ లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

