కొండాపూర్, అక్టోబర్ 4 : ఆరు సంవత్సరాలుగా రెంట్ చెల్లిస్తూ మాదాపూర్‌లో నిర్వహిస్తున్న లక్కీ రెస్టారెంట్‌ను తమకు అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి, ఆయన పీఏల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని రెస్టారెంట్ నిర్వాహకురాలు రెహానా ఆరోపించారు. నెలకు రూ.3,07,000 లక్షల అద్దె చెల్లిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నామని, భూములు విక్రయించి హోటల్ వ్యాపారం ప్రారంభించామని ఆమె తెలిపారు. రెంట్ చెల్లించడం లేదంటూ అబద్ధాలు చెపుతూ హోటల్ లాక్కునే దౌర్జన్యానికి దిగుతున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు.
ప్రతినెల అద్దె చెల్లిస్తున్న బ్యాంకు స్టేట్మెంట్లు, జీఎస్టీ, టీడీఎస్, తదితర అన్ని రకాల పత్రాలు తమతో ఉన్నాయంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒత్తిడి పెంచి ఫుడ్ సేఫ్టీ అధికారులతో రెస్టారెంట్‌ను సీజ్ చేయించారని, అంతేకాకుండా హోటల్‌కు సంబంధించిన నీరు, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లను సైతం తొలగించారని వాపోయారు. హోటల్ ముందు ఉన్న నిర్మాణాన్ని కూడా కూల్చివేయించారన్నారు.
బిల్డింగ్ యజమానికి చెల్లించేందుకు రూ.10 లక్షల నగదును సిద్ధం చేసుకున్నామని, తమ కుమారుడి యూనివర్సిటీ ఫీజు కూడా చెల్లించాల్సి ఉండగా, అది కట్టకుండా నెల రోజులుగా ఇంట్లోనే ఉంచినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారం కొనసాగితేనే తమ కుటుంబానికి జీవనోపాధి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో హోటల్‌ను వదిలేయాలని ఒత్తిడి చేస్తే తమ కుటుంబం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డబ్బులు అడిగిన సందర్భాల్లో కొంత మొత్తం చెల్లించామని, ఇప్పుడు ఏకంగా హోటల్‌నే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమపై జరుగుతున్న ఒత్తిడి, ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని లక్కీ రెస్టారెంట్ నిర్వాహకులు రెహానా కోరుతుంది.