హైదరాబాద్: హైదరబాద్ చంచల్‌గూడలో కిడ్నప్నకు (Kidnap) గురైన 9 నెలల చిన్నారి ఆచూకీ లభించింది. గంటల వ్యవధిలోనే చిన్నారిని జహీరాబాద్‌లో గుర్తించిన పోలీసులు.. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి చంచల్గూడలోని ఓ నర్సింగ్ హోమ్‌లో 9 నెలల చిన్నారి అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అదే దవాఖానలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షెహనాజ్ పాపను ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు.
ఆమె చంచల్‌గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో అక్కడున్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జహీరాబాద్ బస్సులో వెళ్లినట్టు తేలింది. వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.