Social Media | యువతలో అధికంగా సోషల్ మీడియా వినియోగం వారి మానసిక ఆరోగ్యం, సంతోషంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. సమితి విడుదల చేసిన వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ ప్రకారం ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా నిలిచింది. ఈ ఏడాది నివేదికలో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంపై దృష్టి సారించింది. అనేక దేశాలు యువతలో సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించాలా అనే అంశంపై ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 25 సంవత్సరాల లోపు యువతలో సంతోషం గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా అమ్మాయిలలో ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించిందని తెలిపింది.
కాగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో యువత తమ జీవితాలపై మరింత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని గ్యాలప్ సంస్థ సీఈవో తెలిపారు. గత 20 సంవత్సరాల కంటే ఇప్పుడు ప్రపంచ యువత ఎక్కువ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం సంక్లిష్టమైనదిగా నివేదిక అభివర్ణించింది. ఉపయోగించే సమయం, ప్లాట్‌ఫామ్ రకం, వినియోగ విధానం, అలాగే లింగం, ఆర్థిక స్థితి వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. అధికంగా సోషల్ మీడియా వినియోగం తక్కువ సంతోషానికి దారితీస్తుందని, అయితే పూర్తిగా దూరంగా ఉండే వారు కూడా కొన్ని సానుకూల ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పేర్కొన్నారు. 147 దేశాల జాబితాలో యుద్ధంతో నష్టపోయిన ఆఫ్ఘానిస్తాన్ అత్యల్ప సంతోష స్థాయిని నమోదు చేసింది. 2021లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ సూచీలో వ్యక్తిగత ఆదాయం, ఆయుర్దాయం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి భావన వంటి ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తర యూరప్ దేశాలు ఈ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలు ఫిన్లాండ్తో కలిసి టాప్ స్థానాల్లో నిలిచాయి. లాటిన్ అమెరికాకు చెందిన కోస్టారికా నాలుగో స్థానాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్ 10లో 7.764 స్కోర్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నిరుద్యోగం, సంక్షేమ పథకాల కోతలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలు ఇంకా సంతోషంగా ఉన్నారని టాంపెరే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జుహో సారి తెలిపారు. రాజకీయాల కంటే వ్యక్తిగత జీవితం సంతోషాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణం, విశ్వాసపూరిత సమాజం వంటి అంశాలు ఫిన్లాండ్ ప్రజల సంతోషానికి కారణమని పేర్కొన్నారు.
వేలాది సరస్సులు, సౌనా సంస్కృతి, సమగ్ర సంక్షేమ వ్యవస్థతో ఫిన్లాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండడం, అసమానతలు తక్కువగా ఉండడం కూడా సంతోషానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.