Blue Zone Diet | తగినన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధమైన ఆహారం ఆరోగ్యకరమైన జీవితానికి, పరిపూర్ణ ఆయువుకు హామీ ఇస్తాయి. శతాధికులు అత్యధికంగా జీవించే ప్రాంతాలను నిపుణులు ‘బ్లూజోన్’గా వ్యవహరిస్తారు. అక్కడి ఆహార విధానాన్ని ‘బ్లూ జోన్ డైట్’గా పేర్కొంటారు. వారి ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకుంటే.. శతమానం చిరునామా దొరికినట్టే.
ప్రపంచమంతా అనారోగ్యం ప్రబలుతుంటే.. అక్కడ మాత్రం జలుబు, దగ్గులు సైతం నమోదు కావు. అరవై డబ్భు ఏండ్లు బతకడమే గగనమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో సునాయాసంగా సెంచరీ కొడతారు. దీనికి కారణం ఏమిటి? ఆ ప్రజల ఆయురారోగ్యాల రహస్యం ఏమిటి? అనే కోణంలో అనేక అధ్యయనాలు జరిగాయి. భూగోళం మొత్తానికి అత్యధిక ఆయువు కలిగిన ప్రజలు నివసించే.. జపాన్‌లోని ఒకినావా, గ్రీస్‌లోని ఐకారియా, కోస్టారికాలోని నికోయా పెనిన్సులా, ఇటలీలోని సార్డీనియా, అమెరికాలోని లోమా లిండా ప్రాంతాలు బ్లూ జోన్ పరిధిలోకే వస్తాయి.