ఇరాన్ యుద్ధంలో రెండు వారాలపాటు విరామం పాటించేందుకు అమెరికా అంగీకరించడం, ఇజ్రాయెల్ తలూపడంతో ప్రపంచం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నది. ఈ విరామం సంపూర్ణ యుద్ధ విరమణగా పరిణమించాలనే ఆకాంక్ష చమురు, వంటగ్యాస్ సంక్షోభం నుంచి ఇకనైనా విముక్తి లభిస్తుందేమోననే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతున్న ది. అంతిమ ఫలితాల మాట అటుంచి ఈ యుద్ధ విరామమే ఓ కీలక మలుపు. ఇరాన్ దీనిని ఘన విజయంగా చెప్పుకోవడం, ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి హర్షామోదాలు తెలియజేయడం విశేషం. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో ఎవరెక్కడ నిలుస్తారో, ఎవరేమిటో అంచనా వేసుకునేందుకు ఇది సరైన సమయం. ఈ యుద్ధాన్ని ఎగదోసింది ఇజ్రాయెల్ అయితే వెనుకా ముందూ చూసుకోకుండా, నిర్దుష్టమైన వ్యూహం, నికరమైన లక్ష్యం అంటూ ఏదీ లేకుండా దాడికి తెగబడ్డ అమెరికాకు ఘోర పరాభవాన్ని తెచ్చిపెట్టింది. ఇరాన్ విధించిన పది షరతులకు అగ్రరాజ్యాధినేత అధ్యక్షుడు ట్రంప్ బేషరతుగా తలొగ్గడమే ఇందుకు నిదర్శనం. అందులో అతి ముఖ్యమైనది హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని ఒప్పుకుని, టోల్ చెల్లింపు ఏర్పాటుకు తలూపడం అమెరికా తలవంపులకు పరాకాష్ట. కా ల్పుల విరమణ షరతుల ప్రకారం హొర్ముజ్‌లో ఇరాన్ బలగాలు నౌకల రాకపోకలను నియంత్రిస్తాయి. అందుకుగాను టోల్ కూడా వసూలు చేస్తాయి. అంటే యుద్ధానికి ముందు జలసంధిలో స్వేచ్ఛగా విహరించిన నౌకలు ఇప్పుడు సుంకాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదీ ట్రంప్ దుస్సాహసిక యుద్ధం సాధించిన ఘనమైన ఫలితం!
డొనాల్డ్ ట్రంప్ నిలకడ లేని మాటలతో అగ్రరాజ్యం విశ్వవేదికపై అపహాస్యం పాలైంది. ఆయన నిస్పృహకు గురై సభ్యసమాజం ఏమాత్రం ఆమోదించలేని బూతులకు లంకించుకోవడం, ఇరాన్ నాగరికతనే పూర్తిగా నేలమట్టం చేస్తానని హూంకరించడం వంటివి అమెరికాతోపాటుగా ప్రపంచ ప్రజలకు వెగటు పుట్టించాయి. అటు అగ్ర నాయకత్వాన్ని వరుసపెట్టి తుదముట్టిస్తున్నా చెక్కుచెదరని దీక్షతో, మొక్కవోని ధైర్యంతో నిలబడింది ఇరాన్. శత్రువు అంచనాలను తల్లకిందులు చేసి తెగించి పోరాడింది. గంటలు, రోజుల నుంచి యుద్ధం వారాలకు, నెలలకు పాకింది. ఓవైపు ఇజ్రాయెల్‌తో పాటుగా పశ్చిమాసియాలోని అమెరికా ’మిత్రదేశాల’పై క్షిపణుల వర్షం కురిపిస్తూ, పశ్చిమాసియా నౌకారవాణాకు ముఖద్వారమైన హొర్ముజ్‌పై ఇరాన్ పట్టు బిగించింది. అమెరికా యుద్ధ నౌకలను తరిమి కొట్టింది. హొర్ముజ్‌పై దాడికి నాటో దేశాలు, జపాన్ నిరాకరించడంతో అమెరికా ఒంటరి అయ్యింది. ట్రంప్ మొదలుపెట్టిన పనికిమాలిన యుద్ధం అందించిన ఫలితాల్లో ఇది ఒకటి.
ఇక మరో ముఖ్య పరిణామం.. అమెరికా-ఇజ్రాయెల్ రెజీమ్ చేంజ్ (ప్రభుత్వ మార్పు) వ్యూహం బెడిసికొట్టడం. సర్వాధికారి అలీ ఖమేనీని హతమారిస్తే అతని కుమారుడు ఆ పదవిలోకి రావడం రెజీమ్ చేంజ్ కానేరదు. అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టినా ఇరాన్లో పరిపాలనా వ్యవస్థ చెక్కుచెదరకపోవడం గమనా ర్హం. అసలు సిసలు రెజీమ్ చేంజ్‌కు అమెరికాలో సన్నాహాలు జరుగుతుండటం చూస్తు న్నాం. అమెరికా పరపతి, విశ్వసనీయత ఇరాన్ యుద్ధం కారణంగా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఏకైక అగ్రరాజ్యాన్నని విర్రవీగే అమెరికా దురహంకారం క్షిపణి ఢీకొట్టిన ఆకాశహర్మ్యంలా కుప్పకూలింది. ఇజ్రాయెల్ ఆగర్భ శత్రువైన ఇరాన్‌ను నిర్వీర్యం చేయడం, చమురు సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే అత్యాశతో అమెరికా ఈ యుద్ధంలోకి దిగింది. దీని పర్యవసానం మన కండ్ల ముందే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఇరుపక్షాలూ ఆయుధాలను పక్కనబెట్టి దౌత్యానికి పనిచెప్పాలి. శాశ్వత శాంతి దిశగా అడుగులు వేయడం తక్షణావసరం.