మళ్లీ సమైక్య పాలకుల ఎజెండా!
తెలంగాణ ఆంధ్రాతో కలిసిన 1956 తర్వాత నుంచి విడిపోయిన 2014 వరకు 58 ఏండ్ల కాలంలో తెలంగాణ నీళ్ల హక్కులు కోల్పోయింది. కండ్ల ముందే పెద్దఎత్తున నీళ్లు ఆంధ్రాకు తరలిపోతుంటే సమైక్య పాలకులు చోద్యం చూశారు. తెలంగాణ కోసం ప్రాజెక్టులను నిర్మించలేదు.
తెలంగాణ ఆంధ్రాతో కలిసిన 1956 తర్వాత నుంచి విడిపోయిన 2014 వరకు 58 ఏండ్ల కాలంలో తెలంగాణ నీళ్ల హక్కులు కోల్పోయింది. కండ్ల ముందే పెద్దఎత్తున నీళ్లు ఆంధ్రాకు తరలిపోతుంటే సమైక్య పాలకులు చోద్యం చూశారు. తెలంగాణ కోసం ప్రాజెక్టులను నిర్మించలేదు. గోదావరిలో తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ కనీసం 200 నుంచి 300 టీఎంసీల నీళ్లు కూడా తెలంగాణ ఏనాడూ వాడుకోలేని దుస్థితి రాజ్యమేలింది. గట్టిగా 10 వేల టీఎంసీల నీళ్లు కూడా తెలంగాణ పొలాలకు పారలేదు. శ్రీరామ్‌సాగర్, మంజీర, నిజాంసాగర్ ప్రాజెక్టులు మహారాష్ట్ర కట్టిన వందలాది బరాజ్‌ల వల్ల ఏనాడూ పూర్తిస్థాయిలో నిండకుండా వట్టిపోయిన దీన స్థితి. స్వరాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కుల పునరుద్ధరణ జరిగింది. కానీ మళ్లీ నేడు సమైక్య రాష్ట్రంలోని దురవస్థ దాపురించింది.
సమైక్య పాలనలో మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గోదావరి ప్రవహించేది. ఎందుకంటే గోదావరి మీద ఒక్క బరాజ్ కూడా సమైక్య పాలనలో ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఏం జరిగింది. తెలంగాణలో వలసలు, అశాంతి, కరువు దాపురించింది. ఈ దుర్భిక్ష పరిస్థితుల్లో ఆగమాగమై జీవన విధ్వంసం, వేలాది మంది రైతుల ఆత్మహత్యలు, వేలాది మంది యువత అడవుల్లో ఎన్కౌంటర్లు, చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన రైతన్నలు, కళ తప్పిన గ్రామాలు, పంటలు లేక, పనులు లేక, విచ్ఛిన్నమైన గ్రామీణ తెలంగాణ లక్షలాది మంది వలసల బాట.
అడవులు, వన్యప్రాణి చట్టాలు, అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి అనుమతులు రాకుండా నీచమైన ఆలోచన విధానాలతో తెలంగాణకు నీళ్ల్లెందుకు అనే కుత్సితబుద్ధితో ఏ ప్రాజెక్టునూ ముంగట వడకుండా పూర్తిచేసిన వైనం ఒక్కటీ లేదు. తమ్మిడిహట్టినే తీసుకుంటే..మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదం, అడవులు, వన్యప్రాణి చట్టాల్లో ఇరికించి అది ఎన్నడూ ముంగట వడకుండా చేశారు.
పోనీ మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకొన్నా (ఒప్పుకొనే పరిస్థితి లేదు.. అది అసాధ్యం) నిర్మించి, ఎల్లంపల్లి దగ్గరకు నీళ్లు తీసుకురావాలన్నా మధ్యలో అడవులు, సింగరేణి మైన్స్ వంటి అనుమతులు రాని ఎన్నో అడ్డంకుల నడుమ ఆ ప్రాజెక్టును ఇరికించిన ఘనత కాంగ్రెస్ పాలకుల సొంతం. 58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రయాణం తీవ్రమైన విధ్వంసానికి గురై జీవచ్ఛవంలా మారింది. ఎంతటి దారుణమంటే..75 వేల చెరువులు ఉన్నా వేలాది చెరువులు మాయ మై చివరికి 46,500 మాత్రమే మిగిలిన పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ నీటి వాటాను వాడుకోవాలని తమ్మిడిహట్టిని పక్కకు పెట్టి రీ డిజైన్‌తో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్వరూపాన్ని మార్చివేసిన చరిత్ర మన కండ్ల ముందే ఉన్నది. 2014లో 45 వేల కోట్ల విలువైన పంటలు పండిన తెలంగాణలో కాళేశ్వరం నిర్మాణం తర్వాత 1.16 లక్షల కోట్ల పంటలకు చేరింది. చెరువులు నింపడం ద్వారా ఎండాకాలంలో కూడా మత్తళ్లు దూకిన జల పరవళ్లను చూసినం. భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది.
కాళేశ్వరంలో భాగంగా 145 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను చూసినం. సమైక్య పాలనలో జీవం కోల్పోయిన తెలంగాణ.. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా, అన్నపూర్ణగా నిలువడం ఎవరూ కాదనలేని నిజం. సమైక్య పాలనలో కరువుతో వలసలు పోయిన నేల బీఆర్ఎస్ పాలనలో రివర్స్ మైగ్రేషన్‌తో విలసిల్లింది. కేసీఆర్ హయాంలో దేశానికి అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ మీద కుట్రలు మొదలైనయి. సరిగ్గా ఎన్నికల ముందు.. ఎన్నికల కోడ్ రాగానే పెద్ద శబ్దంతో మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుంగినయి. ఆ శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. ఇక అభివృద్ధి మీద, సంక్షేమం మీద కేసీఆర్ పాలన మీద విమర్శలు చేస్తే అభాసుపాలవుతామని భావించిన కాంగ్రెస్, బీజేపీ ఎన్నుకున్న పద్ధతి వ్యక్తిత్వ హననం. కొన్నేండ్లుగా ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని విమర్శలు చేస్తున్నారు. చివరికి ఎన్నికల్లో గెలుస్తామో లేదోననే అనుమానంతో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసానికి పాల్పడ్డారనే ఆరోపణ ఉన్నది.
దేశంలో అనేక ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతెందుకు.. పొరుగున ఉన్న ఏపీలో పోలవరం ప్రాజెక్టు అనేకమార్లు కొట్టుకుపోయినా రాని ఎన్డీఎస్ఏ మేడిగడ్డ పిల్లర్లు కుంగగానే 24 గంటలు గడువక ముందే రంగంలోకి దిగింది. ఒక్క రోజు గడువక ముందే రిపోర్ట్ ఇచ్చిన చరిత్ర స్వతంత్ర భారతంలో ఇదొక్కటే. అహంకారం వంటి వ్యక్తిత్వ హననాలు. ఒకటికి రెండిస్తాం. రెండుకు నాలుగిస్తామని అరచేతిలో వైకుంఠం చూపడం.. చివరికి మేడిగడ్డను బూచిగా చూపి చేసిన విషప్రచారంతో ఏమరుపాటుకు గురైన ప్రజలు స్వల్ప తేడాతో కాంగ్రెస్‌కు అధికారం అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చినా తన మునుపటి సమైక్య బానిసత్వాన్ని వదులుకోలేని విశృంఖల రూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది కాంస్ పార్టీ.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్‌ను తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖను అప్పజెప్పిండ్రు. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని ముందుకు వచ్చినా అడ్డుపడ్డారు. డీపీఆర్‌లు వెనక్కి వచ్చినా చలనం లేకుండా ఉండిపోయిండ్రు. చెరువులను నింపడం మానేసిండ్రు. అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసిండ్రు.
మేడిగడ్డ కొట్టుకుయిందని దుష్ప్రచారం చేస్తూ మూడేండ్లుగా పాలకులు మరమ్మతులను ముట్టుకోలేదు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్వహణను గాలికి వదిలేశారు. దుండగులు చెక్‌డ్యాములను పెట్టి పేల్చేస్తుంటే చోద్యం చూస్తున్నారు. మళ్లీ సమైక్య పాలనలోకి యథేచ్ఛగా తరలిపోయినట్టు గోదావరి జలాలు ఏ ఆటంకాలు లేకుండా ఆంధ్రాకు వెళ్లేటట్టు రాస్తా క్లియర్ చేసింది కాంగ్రెస్ సర్కార్.
ఎల్ నినో వస్తుందని అందరూ మొత్తుకున్నా నీళ్లను ఎత్తిపోయకుండా 750 టీఎంసీలను ఆంధ్రాకు అప్పజెప్పింది కాంస్ ప్రభుత్వం. దీనిపై విమర్శలు రాగానే ‘దూప అయితే బావిని తవ్వినట్టు’ తమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసమంటూ మహారాష్ట్రకు పోయి డ్రామాలు స్టార్ట్ చేసింది. 240 టీఎంసీలతో కాళేశ్వరం సిస్టమ్ సిద్ధంగా ఉన్నా 70 టీఎంసీలు, అది కూడా 152 మీటర్ల ఎత్తులో కడితేనే లభించే ప్రాజెక్టు కోసం డ్రామాలు చేయడమంటే ఆంధ్రా పాలకులు, నీటి దొంగల ఎజెండాను మోయడమే. అడవులు, మైన్స్, ఎత్తు, వన్యప్రాణి సంరక్షణ ఎకో జోన్.. ఇన్ని అడ్డంకులు ఉన్న ప్రాజెక్టు పట్ల.. అసలు సాధ్యమే కాని ప్రాజెక్టును తెరపైకి తేవడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే.
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం తమ్మిడిహట్టి దగ్గర 1,100 టీఎంసీలు ఉంటే మేడిగడ్డ దగ్గర 1,651 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. అది కూడా 365 రోజుల పాటు మేడిగడ్డలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. ఇంతటి కరువు కాలంలో కూడా 21 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వెళ్తున్నాయి. సమైక్య పాలనలో జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో.. ఇప్పుడు గోదావరి మీద 7 బరాజ్‌లు కట్టుకుని.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని.. మొత్తం కాళేశ్వరం వాటర్ గ్రిడ్ సిస్టమ్ సిద్ధంగా ఉండి కూడా.. వేల టీఎంసీల నీళ్లు మళ్లీ ఆంధ్రాకు మలుపుతూ.. తెలంగాణకు కరువును తెచ్చి.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఇండస్ట్రీస్ హాలిడేలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ర్టాన్ని షట్‌డౌన్ చేసింది. సమైక్య పాలకుల ఎజెండాను అమలు చేస్తున్నది.
-కర్ర రంజిత్ రెడ్డి ,99856 16755
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

