దశాబ్ది తెలంగాణ సాహిత్యానికి నిలువుటద్దం
సాహితీ స్రవంతిగా కొనసాగి 25 ఏండ్లు, తెలంగాణ సాహితి ఏర్పడి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వెలువడిన సంచిక ఇది.
సాహితీ స్రవంతిగా కొనసాగి 25 ఏండ్లు, తెలంగాణ సాహితి ఏర్పడి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వెలువడిన సంచిక ఇది. సాహిత్యం నిర్వహించాల్సిన పాత్రను మరొకమారు మననం చేసుకోవడం, చైతన్యాన్ని నింపుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల లక్ష్యంగా సంపాదకుడు కే ఆనందాచారి పేర్కొన్నారు. ఇందులో 33 మంది సుప్రసిద్ధ కవులు, రచయితలతో 33 మంది కవులు, రచయితలు జరిపిన ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలే కాకుండా 100 మంది రచయితలు రాసిన వ్యాసాలతో పాటు 82 మంది కవులు రాసిన కవితలు కూడా ఉన్నాయి.
ఈ సంచిక సంపాదకుడు మాట్లాడుతూ దశాబ్దికాలంలో సాహిత్యరంగ నడక దిశ ఎట్లా ఉన్నది, సృజన తీరు ఎలా ఉన్నది, తాత్వికత దృష్టి కోణాలు, వస్తు వైవిధ్యాలు, శిల్ప ప్రయోగాలు ఎలా ఉన్నాయో రేఖామాత్రంగానైనా అంచనా వేసుకోవడం అవసరంగా భావించి ఈ సంచికను తీసుకువచ్చామని తెలిపారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు తెలకపల్లి రవి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ దశాబ్ది ఉత్సాహంతో విశాల ప్రజా సాహిత్య వేదికగా సవాళ్లు తీవ్రమైనప్పుడు సంఘర్షణ తీవ్రం కాకతప్పదని అన్నారు.
ప్రముఖ కవి, విమర్శకుడు సీతారాం తన ‘తెలంగాణ జీవద్రవ్యం కవిత్వమే’ అనే వ్యాసంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచన కవులకు నాలుగైదు రకాల ముద్రలు పడ్డాయన్న విషయాన్ని ప్రస్తావించారు. అనంతోజు మోహనకృష్ణ రాసిన ‘తెలుగు వెలుగుల రేడు సినారె’ అనే వ్యాసంలో విశ్వంభర కావ్యంలో మట్టిని, ఆకాశాన్ని, మనుషులను గానం చేసినవాడు, బోధనలో, శోధనలో, కార్యనిర్వహణలో తనదైన ముద్ర వేసినవాడు, తెలుగు నేల ఉన్నంతకాలం ఆయన సృజించిన సినిమా పాట మోగుతూనే ఉంటుందని సినారె బహుముఖీన ప్రతిభను కొనియాడారు.
ప్రముఖ కథా రచయిత శిరంశెట్టి కాంతారావు రాసిన ‘తెలుగు కథ నిన్న నేడు రేపు’ అనే వ్యాసంలో తెలంగాణలో కథ పరిణామ వికాసాన్ని వివరించారు. ఆచార్య బన్న అయిలయ్య రాసిన వ్యాసంలో తెలంగాణలో దశాబ్ది కాలంలో వెలువడిన కథా సాహిత్యంలో భూస్వామ్య పెత్తందారీ పరిణామాల్ని తెలిపారు. తంగిరాల చక్రవర్తి రాసిన ‘తెలంగాణ గుండెచప్పుడు దాశరధి రంగాచార్య’ అని వ్యాసంలో దాశరధి రంగాచార్య రాసిన రచనలు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాయని, తెలంగాణ గుండెచప్పుడును పలు రకాల నవలలు వినిపించాయని వివరించారు.
దశాబ్దికాలంలో తెలంగాణలో వెలువడిన నవలల గురించి కేపీ అశోక్ కుమార్ తన వ్యాసం ద్వారా పేర్కొన్నారు. కె.ఆనందచారి రాసిన ‘సాహితీ చక్రవర్తి తంగిరాల’ అనే వ్యాసంలో తంగిరాల చక్రవర్తి కవిత్వ విశిష్టతను తెలిపారు. ఆచార్య పిల్లలమర్రి రాములు రాసిన వ్యాసంలో కేకేఆర్ విమర్శనా పటిమను సాధికారికంగా తెలిపారు. ‘సాహిత్య విమర్శ ఎలా ఉండాలి’ అంటూ బండారి రాజ్కుమార్ రాసిన వ్యాసం ద్వారా తెలియజేశారు. ‘విప్లవాల గానలోలుడు గద్దర్’ అంటూ అనిశెట్టి రజిత ప్రజాయుద్ధనౌక గద్దర్ గురించి మంచి వ్యాసాన్ని అందించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పాట గురించి డాక్టర్ పసునూరి రవీందర్ రాసిన వ్యాసంలో బలమైన ఉద్యమాలు రాకపోవడం వల్ల ఒక వినోదపు విలువగా పాటను దిగజార్చే చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో సాహిత్య సృజనకు పరిశోధనకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి తన వ్యాసం ద్వారా వెల్లడించారు. అకాల మరణానికి గురైన డాక్టర్ మండల స్వామి బహుముఖ ప్రతిభను గురించి పెరుమాళ్ల ఆనంద్ తన వ్యాసం ద్వారా వివరించారు. డాక్టర్ పత్తిపాక మోహన్ దశాబ్ది తెలంగాణ బాలసాహిత్యాన్ని తన వ్యాసం ద్వారా సమగ్రంగా పేర్కొన్నారు.
పంప భారతంలోని ప్రయోగాలు ప్రత్యేకతల గురించి డాక్టర్ మామిడి హరికృష్ణ తన పరిశోధనాత్మక వ్యాసం ద్వారా సమగ్రంగా విశ్లేషించారు. బాలసాహితీరత్న పెండెం జగదీశ్వర్ సాహిత్య కృషిని ముక్కామల జానకిరామ్ తన వ్యాసం ద్వారా ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో సాధికారమైన స్వీయ గొంతుకతో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కవయిత్రి ఎన్.అరుణ సాహితీ ప్రస్థానాన్ని రాపోలు సీతారామరాజు వివరించారు. దశాబ్దకాలంగా సాహిత్య వికాసం కోసం తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న కృషిని డాక్టర్ జె.చెన్నయ్య తన వ్యాసం ద్వారా వివరించారు. దశాబ్ద్ద కాలంలో తెలంగాణ నేపథ్యంతో వెలువడిన పరిశోధనల గురించి డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి సమగ్రంగా వివరించారు. ఈ సంచిక గత దశాబ్ది కాలంలో తెలంగాణ సాహిత్య వికాసానికి అద్దం పట్టడమే కాకుండా పరిశోధకులకు ఉపయుక్త గ్రంథమవుతుంది.
(వ్యాసకర్త: అసోసియేట్ పొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట)
-డా.తండు కృష్ణ కౌండిన్య,9704731346
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

