డైవర్షన్ నాటకం
రంగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మందీ మార్బలాన్ని వెంటేసుకుని ముంబైకి పోనూ పోయారు, రానూ వచ్చారు. ఉన్న కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయలేని వాళ్లు తగుదునమ్మా అంటూ తమ్మిడిహట్టి కోసం అర్జంటుగా మహారాష్ట్రతో మంతనాలకు వెళ్లారు. అక్కడి బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముచ్చట్లు పెట్టి తిరిగి వచ్చారు. రాంగనే ’సానుకూలంగా స్పందించారంటూ’ సంబురంగా మీడియా ముందు ప్రకటించేశారు.
రంగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మందీ మార్బలాన్ని వెంటేసుకుని ముంబైకి పోనూ పోయారు, రానూ వచ్చారు. ఉన్న కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయలేని వాళ్లు తగుదునమ్మా అంటూ తమ్మిడిహట్టి కోసం అర్జంటుగా మహారాష్ట్రతో మంతనాలకు వెళ్లారు. అక్కడి బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముచ్చట్లు పెట్టి తిరిగి వచ్చారు. రాంగనే ’సానుకూలంగా స్పందించారంటూ’ సంబురంగా మీడియా ముందు ప్రకటించేశారు. దానికి అర్థం ఏమిటో సీఎంకే తెలియాలి. మహారాష్ట్ర సీఎంకు తన వైఖరిపై స్పష్టత ఉన్నది. పొరుగులకు సహకరించేందుకు సిద్ధమే కానీ తమ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది అనేది ఆయన ప్రకటనలోని కీలకాంశం. లోతుగా సాంకేతికపరమైన అధ్యయనం చేయాలి. చివరికి తమ తుది నిర్ణయం కేంద్ర జలసంఘానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు ఫడ్నవీస్. పొరుగుబాబుల కోసం సొంత రాష్ట్రంలో కరువు తెచ్చిపెట్టిన కాంగ్రెస్ నేతలకు ఈ ప్రకటన ద్వారా తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి విస్పష్టమైన హామీ ఇవ్వలేదు. మర్యాద చేసి పంపారంతే. ’మీకు సాయం చేయడానికి సిద్ధం. కానీ మా సంగతి మాకు ముఖ్యం’ అనేది ఆయన మాటల సారాంశం. పైగా ’మేం చెప్పాల్సిందేదో చెప్పాల్సిన వాళ్లకు చెప్తాం’ అని కూడా ముక్తాయింపు ఇచ్చారాయన. అంటే తమ నిర్ణయమేదో నేరుగా తెలంగాణకు చెప్పరన్న మాట. ఇందులో సానుకూలమైన అంశం ఏమిటో రేవంత్‌కే తెలియాలి.
తెలంగాణ నీటి ప్రాజెక్టుల్లో తమ్మిడిహట్టి ఓ పీటముడి లాంటిది. అక్కడ నీళ్లు లేక కాదు. దండిగానే ఉంటాయి. కానీ ప్రాజెక్టు ఎత్తు అనేది కొరకరాని కొయ్య లాంటి సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తును ప్రతిపాదించింది. ఆ మాత్రం ఎత్తు లేకపోతే తగినంత నీటిని ఎత్తిపోయడం కుదరదు. అంత ఎత్తున ప్రాజెక్టు కడితే మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుంది. అభయారణ్యం కూడా చాలావరకు మునిగిపోతుంది. అందుకే ఎత్తు విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ పొత్తు పొసగలేదు. కాంగ్రెస్ పార్టీ దీనిపై సుదీర్ఘకాలంగా నాటకాలాడుతూ వచ్చింది. చర్చలు ఆగవు, అనుమతులు రావు, పనులు ముందుకు సాగవు.. ఈ ముప్పేట తంతు నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నది.
2005లో మహారాష్ట్రతో సంప్రదింపులు ప్రారంభించిన కాంగ్రెస్ మూడేండ్ల తర్వాత 2008లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిపింది. అంతకుమించి తట్టెడు మట్టి ఎత్తలేదు, జిట్టెడు గోడ పెట్టలేదు. మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే తూతూమంత్రంగా పనులు సాగించింది. 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నది. ప్రాజెక్టు మాత్రం అంగుళం ముందుకు కదల్లేదు. 2014లో స్వరాష్ట్రం ఏర్పాటు కావడంతో ప్రథమ సీఎంగా కేసీఆర్ తెలంగాణ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచనలు చేసి ముందుగా మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపారు. ఎత్తు విషయంలో మహారాష్ట్ర ససేమిరా అనడంతో రీడిజైనింగ్ చేశారు. కాళేశ్వరం గొలుసుకట్టు ఎత్తిపోతలను రూపొందించి గంగను గట్టులెక్కించారు. కేవలం మూడేండ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం మూడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు పారించారు. దాంతో తెలంగాణ అన్నపూర్ణగా, దేశానికే ధాన్యాగారంగా మారింది. మాయదారి హామీలు, మోసకారి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కక్ష రాజకీయాలతో కాళేశ్వరాన్ని పండబెట్టి, పొలాలను ఎండబెట్టింది. నీటి భరోసాను నిరర్థకం చేసింది. చేతగాని, చేవలేని పాలనలో సాగు సడుగులిరిగిపోయి మూలకు పడింది.
వరద వచ్చినప్పుడు సకాలంలో మోటర్లు నడిపి నీళ్లు ఎందుకు ఎత్తలేదని కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. ఆ సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు ఇప్పుడు తాజాగా మళ్లీ తమ్మిడిహట్టి అంటూ పాత పాట అందుకున్నది కాంగ్రెస్ సర్కార్. మూడేండ్లలోనే కాళేశ్వరాన్ని కట్టి కేసీఆర్ రికార్డు సృష్టించారు. పైగా కాంగ్రెస్ ప్రాజెక్టు కట్టకుండానే తవ్వి వదిలేసిన కాలువలనూ ఉపయోగంలోకి తెచ్చారు. అదే కాంగ్రెస్‌కు తాను మొదటి నుంచీ చెప్తున్న తమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో చర్చల జరిపేందుకు మూడేండ్లు పట్టింది. తమ్మిడిహట్టి తలపెట్టి 21 ఏండ్లు దాటింది. ఇప్పుడు హఠాత్తుగా అన్ని విషయాలు అనుకూలించాయనుకుందాం. మరో 21 సంవత్సరాలకైనా ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టగలదా? వచ్చే ఎన్నికల్లో గల్లంతు కానున్న కాంగ్రెస్‌కు అంత సీన్ లేదనేది తెలిసిందే. గతంలో తెలంగాణకు సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులను ఏండ్లకు ఏండ్లు సాగదీసిన చరిత్ర కాంగ్రెస్‌ది. మొన్న ముంబైలో చూద్దాం, చేద్దాం అనే ధోరణిలో మహారాష్ట్ర సమాధానమిచ్చింది. తమకు హానికరమైన ప్రతిపాదనను మహారాష్ట్ర ఎన్నటికీ ఆమోదించదు అనేది శిలాక్షరం. ఈ నాటకం ఇంకెంతో కాలం సాగదు కూడా. కాంగ్రెస్ సర్కార్ కక్ష రాజకీయాలకు ప్రజలను బలిపెట్టడం మానుకుని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పంపులను మళ్లీ నడిపించడం మీద దృష్టి పెట్టడం మంచిది. ప్రస్తుత నీటి సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించాలంటే అదొక్కటే మార్గం. అలా చేయకపోతే చరిత్ర ఆ పార్టీని ఎన్నటికీ క్షమించదు.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

