హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంచన్‌బాగ్ హఫీజ్‌బాబా నగర్‌లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని బట్టల షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న కంచన్ బాగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.