Indian 2 Movie | కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాపై ఉన్న అంచనాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్న దాని కంటే బాగా ఆలస్యంగా జరుగుతుంది. అయినా కూడా శంకర్ దీని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. కంటెంట్ బాగుంటే చాలు ఎప్పుడు వచ్చిన సినిమా ఆడుతుంది అని నమ్మకంగా ఉన్నాడు శంకర్. అందుకే 300 కోట్ల బడ్జెట్ దాటినా కూడా నిర్మాతలను నిశ్చింతగా ఉండమంటూ ఆయన సూచిస్తున్నాడు. మొదట్లో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ ఈ సీక్వెల్ కు అండగా నిలబడ్డాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతుంది. తాజాగా చెన్నైలో ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో కమల్ హాసన్ తో పాటు రకుల్ సహా పలువురు నటీనటులు పాల్గొన్నారు. తర్వాత షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్లాన్ చేయబోతున్నారు. సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుకుంటున్నాడు శంకర్. సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు కమెడియన్ వివేక్ తో పాటు సీనియర్ నటుడు నెడుముడి వేణు బతికే ఉన్నారు. కానీ ఇండియన్ 2 షూటింగ్ మొదలైన తర్వాత ఎన్నో మారిపోయాయి. ఈ మధ్యలో రెండు సంవత్సరాలు బ్రేక్ కూడా వచ్చింది. దానికి తోడు ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదం జరిగే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అన్నింటికీ మించి బడ్జెట్ ఇష్యూస్ రావడంతో నిర్మాతలు సినిమాను అర్ధాంతరంగా ఆపేశారు. ఈ గ్యాప్ లో వేణుతో పాటు వివేక్ కూడా మరణించారు. కాకపోతే భారతీయుడు సీక్వెల్లో ఇద్దరిదీ కీలక పాత్ర కావడంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుకొని వీళ్ళ క్యారెక్టర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు శంకర్. దీనికోసమే దాదాపు 13 నుంచి 15 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.
మార్చిలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15న భారతీయుడు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు పుష్ప 2 కూడా వస్తుంది. అయినా కూడా తన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కమల్ హాసన్ సినిమా పూర్తి అయిన తర్వాత గేమ్ చేంజర్ వైపు అడుగులు వేయనున్నాడు శంకర్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటి వరకు 50 శాతం పూర్తయింది. దీని బడ్జెట్ కూడా 250 నుంచి 300 కోట్ల వరకు అవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇండియన్ 2 హిట్ అయితేనే కానీ చరణ్ సినిమాపై అంచనాలు పెరగవు. చూడాలిక ఏం జరగబోతుందో..!