Luger Meaning | అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon) ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో ‘NTR-Neel’గా పిలవబడిన ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ గ్లింప్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ఎంటంటే.. ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు ‘లూగర్’ (Luger). ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ లో ‘రాకీ’, సలార్ లో ‘దేవా’ అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ‘లూగర్’ అనే వెరైటీ పేరు పెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై చిత్రబృందం స్పందించకపోగా.. ‘లూగర్’ అనే పదానికి గూగుల్, వీకిపిడియాలో ఒక అర్థం కనిపిస్తుంది. అది ఏంటి అనేది చూసుకుంటే. ‘లూగర్’ అనేది ఒక క్లాసిక్ జర్మన్ పిస్టల్ (తుపాకీ) పేరు అని తెలుస్తుంది. వరల్డ్ వార్ సమయంలో జర్మనీ సైన్యం ఉపయోగించిన ఈ లూగర్ పిస్టల్.. అత్యంత ఖచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి, క్రూరత్వానికి మారుపేరని సమాచారం. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక సాధారణ మనిషిలా కాకుండా, ఒక లోడెడ్ గన్లా.. శత్రువులను వేటాడే ఒక ప్రాణాంతక ఆయుధంలా ఉండబోతోంది. అందుకే ప్రశాంత్ నీల్ ఈ పేరును ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి చెందిన ‘అసాసిన్-ఇన్-చీఫ్’ (ప్రధాన హంతకుడు/షార్ప్ షూటర్) గా కనిపిస్తున్నారు.
1967 కాలానికి చెందిన అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) వ్యాపారం, స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఓపియం వ్యాపారం ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’లుగా విడిపోతుంది. ఈ క్రమంలో జరిగే రక్తపాతం, మాఫియా యుద్ధాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత నటిస్తుండగా.. నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.