Vishwambara | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా విజయోత్సాహం మధ్యనే దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను చిరంజీవి ప్రారంభించారు. గ్రాండ్ లాంచ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ అభిమానులను ఎక్కువగా కలవరపెడుతున్న విషయం మాత్రం ‘విశ్వంభర’ మూవీ గురించే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే ప్రారంభమై, షూటింగ్ కూడా పూర్తయిన దశకు చేరుకున్నప్పటికీ.. ఇప్పటివరకు విడుదల తేదీపై స్పష్టత రాకపోవడం అభిమానుల్లో అనుమానాలు పెంచుతోంది.
దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ మెగాస్టార్ కెరీర్లో అత్యంత భారీ ఫాంటసీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ సెట్స్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని వార్తలు వచ్చినప్పటికీ, సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మొదట ఈ సినిమాను సమ్మర్ రిలీజ్‌గా తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆ ప్లాన్ అమలు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమా నుంచి పెద్దగా అప్డేట్లు కూడా లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“కనీసం రిలీజ్ ఎప్పుడు అనేది అయినా చెప్పండి”, “మూవీపై అప్డేట్స్ ఇవ్వండి”, “ఎంతకాలం వెయిట్ చేయాలి?” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ ఆలస్యానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని టాక్ వినిపిస్తోంది. ఫాంటసీ జానర్ కావడంతో సినిమాకు భారీ స్థాయిలో VFX అవసరం పడుతోంది. ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి. ముఖ్యంగా ఫాంటసీ జానర్లో వస్తున్న ‘విశ్వంభర’ పై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కానీ వరుసగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతుండటం, ‘విశ్వంభర’పై మాత్రం నిశ్శబ్దం కొనసాగడం ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి పెంచుతోంది.