ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. జులై 3న సినిమా విడుదల కానున్నది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ‘సుర సుర సుర సుక్కలు తేరా సుట్టేద్దాం.. తర తర తర తోరణాలే కట్టేద్దాం’ అంటూ సాగే ఈ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను జునైద్ కుమార్, అభే స్వరపరచగా అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ ఆలపించారు. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ అని మేకర్స్ చెబుతున్నారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.