Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ నడిచింది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సాధించిన విజయానికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి ముడిపెడుతూ నెటిజన్లు పవన్ కళ్యాణ్‌ని దారుణంగా ట్రోల్ చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ విజయ్ తన తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. 234 ఆసెంబ్లీ స్థానాలకు గాను 107 సీట్లను గెలుచుకుని తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అయితే ఈ విజయాన్ని అభినందిస్తూనే, కొందరు నెటిజన్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న వైఫల్యాలను, ఆయన పార్టీ అధికారంలోకి రావడానికి పట్టిన సమయాన్ని విజయ్ సాధించిన వేగవంతమైన ఫలితాలతో పోలుస్తూ వ్యంగ్యంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించి 2019 ఎన్నికలలో పోటి చేయగా.. దారుణంగా ఓటమి చెందడంతో పాటు 2024 ఎన్నికలలో పొత్తుపెట్టుకుని 21 సీట్లను గెలుచుకున్నాడు. దీంతో తెలుగు నెటిజన్లు విజయ్‌ని చూసి పవన్ కళ్యాణ్ చాలా నేర్చుకోవాలని ఇప్పటికైన పవన్ కళ్యాణ్ పొత్తు నుంచి బయటకు వచ్చి 2029 ఎలక్షన్స్‌లో సొంతంగా పోటిచేయాలని పవన్‌ను విమర్శిస్తున్నారు. అలాగే కులం మతం (సనాతని హిందూ) ప్రస్తావన తీయకుండా ఎలా గెలవాలో విజయ్‌ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ట్రోలింగ్‌ను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు వేర్వేరు అని, పవన్ కళ్యాణ్ తన పోరాట పటిమతోనే ఈరోజు రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు. విజయ్ విజయాన్ని పవన్‌తో పోల్చడం సరికాదని, ప్రతి ఒక్కరి రాజకీయ ప్రయాణం భిన్నంగా ఉంటుందని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా, తమిళ గడ్డపై విజయ్ సాధించిన విజయం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.