Vijay | తమిళనాడులో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే కు పోటీగా NDA కూటమి, అలాగే తమిళగ వెట్రూ కగజం (TVK) పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. టాలీవుడ్ స్టార్‌గా గుర్తింపు పొందిన విజయ్ స్థాపించిన TVK పార్టీ ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం విశేషం. అయితే ఒక్క నాయకుడిగా విజయ్ అన్ని చోట్ల ప్రచారం చేయడం కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువేరుంపూర్ నియోజకవర్గం నుంచి TVK తరఫున పోటీ చేస్తున్న నవల్పట్టు విజి అనే అభ్యర్థి, విజయ్ తన ప్రాంతానికి రాలేకపోవడంతో ఆయన విగ్రహాన్ని తయారు చేసి ప్రచారంలో వినియోగిస్తున్నాడు. ఓపెన్ వ్యాన్‌లో విజయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నామినేషన్ దాఖలు చేసిన ఆయన, ఆ తర్వాత కూడా ప్రతిరోజూ అదే విగ్రహంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. విజయ్‌పై అభిమానంతోనే ఇలా చేస్తున్నానని నవల్పట్టు విజి చెబుతున్నారు. ఇక మరికొంత మంది TVK అభ్యర్థులు మరో అడుగు ముందుకేసి, విజయ్‌లా కనిపించే డూప్లికేట్ వ్యక్తులను తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఆయన స్టైల్, డైలాగులు, వేషధారణను అనుకరిస్తూ ప్రచారం చేయడం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
విజయ్ విగ్రహంతో పాటు డూప్లికేట్ విజయ్‌లతో సాగుతున్న ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో వినూత్న ప్రచార పద్ధతులకు ఇది కొత్త ఉదాహరణగా నిలుస్తోంది. ఈసారి తమిళనాడు ఎన్నికలు కేవలం రాజకీయ పోటీగానే కాకుండా, వినూత్న ప్రచారాల వేదికగా మారాయి. ఈ వ్యూహాలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపిస్తాయో, TVK పార్టీకి ఎంత మేర లాభం చేకూరుస్తాయో ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది.