అగ్ర హీరో వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మాతగా, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహ నిర్మాణంలో రూపొందున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే కల్యాణ్‌రామ్, ఇతర నటీనటులపై చిత్రీకరించిన ఓ పాటను చిత్రబృందం పూర్తి చేసింది.
తాజాగా విక్టరీ వెంకటేశ్ ఈ సినిమా షూట్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి ఈ సన్నివేశాల్లో పాల్గొటున్నారు. వెంకీ, కల్యాణ్‌రామ్ కాంబినేషన్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అనిల్ రావిపూడి ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.