Vaazha 2 | ఈ ఏడాది పెద్ద స్టార్ హీరోల సినిమాల కంటే యూత్ కథలతో వచ్చిన చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కొన్ని చిన్న చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి. అలాంటి చిత్రాల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘వాలా 2’. ఇప్పటికే విడుదలైన తొలి భాగం అక్కడ సంచలన విజయాన్ని అందుకోగా, అదే దర్శకుడు రెండో భాగాన్ని మరింత కొత్తగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా కొత్త నటీనటులతో సినిమా రూపొందించినప్పటికీ కథ, భావోద్వేగాలు, యువతకు దగ్గరైన అంశాలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. మన ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది.యువత భావోద్వేగాలు, స్నేహం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిర్మాత సాహు గారపాటి తెలుగు ప్రేక్షకులకు అందించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికలోకి అడుగుపెట్టింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నేటి నుంచి ఈ సినిమా తెలుగు, మలయాళం సహా మొత్తం ఐదు భాషల్లో ప్రసారం అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం పొందారు. ఈ సినిమాలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్త నటీనటులైనా తమ సహజ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. దర్శకుడు సావిన్ ఎస్ ఏ యువత భావోద్వేగాలను సహజంగా చూపించిన తీరు సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడే వారికి ‘వాలా 2’ మంచి వినోదాన్ని అందించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్నేహం, ప్రేమ, జీవిత పోరాటాల నేపథ్యంలో సాగే ఈ సినిమా యూత్‌ని మరింత ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.