Nora Fatehi | కన్నడ చిత్రం ‘కేడీ: ద డెవిల్’ (KD: The Devil) లోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట తీవ్ర వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో నటించిన బాలీవుడ్ నటి నోరా ఫతేహీపై అలీగఢ్‌కు చెందిన ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా అనే మతపరమైన సంస్థ ఫత్వా జారీ చేసింది. ఈ పాటలోని సాహిత్యం ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా ఉందని సదరు సంస్థ పేర్కొంది. ఇటువంటి ప్రదర్శనలు సమాజంలో తప్పుడు సందేశాన్ని పంపుతాయని, ముఖ్యంగా ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తాయని వారు తమ ఫత్వాలో పేర్కొన్నారు. మరోవైపు ఈ పాటకు దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పాటపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఈ విషయాన్ని ధృవీకరించారు.
మరోవైపు ఈ వివాదంపై నోరా ఫతేహీ స్పందిస్తూ.. ఈ పాట హిందీ వెర్షన్లో తనకేమీ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం సంజయ్ దత్ వంటి దిగ్గజ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం, అలాగే ఇది ‘నాయక్ నహి ఖల్ నాయక్ హూ మై’ వంటి ఐకానిక్ సాంగ్ రీమేక్ అని భావించి తాను అంగీకరించానని తెలిపారు. తనకు కన్నడ భాష తెలియదని, మేకర్స్ చెప్పిన అనువాదం అప్పట్లో అభ్యంతరకరంగా అనిపించలేదని ఆమె వివరణ ఇచ్చారు. ధ్రువ సర్జా హీరోగా, ప్రేమ్ దర్శకత్వంలో 1970ల నాటి బెంగళూరు నేపథ్యంతో తెరకెక్కిన ‘కేడీ: ద డెవిల్’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
ఫత్వా జారీ చేస్తే ఏం అవుతుంది.?
ఇస్లామిక్ పండితులు ఆధారంగా ఏదైనా ఒక విషయంపై ఇచ్చే వివరణే ఫత్వా. ఉదాహరణకు ఒక పాట లేదా సినిమా ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తే, దానిని చూడకూడదని లేదా అది తప్పు అని ఫత్వా ఇస్తారు. అయితే ఫత్వాను గౌరవించి, సదరు వ్యక్తిని లేదా విషయాన్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలగడం లేదా వారు సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఫత్వాకు ఎటువంటి చట్టపరమైన గుర్తింపు లేదు. ఫత్వా జారీ చేసినంత మాత్రాన పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేరు లేదా కోర్టులు దానిని తీర్పుగా పరిగణించవు. రాజ్యాంగం ప్రకారం దేశ చట్టాలే అత్యున్నతమైనవి.