Ambas Revenge | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతతో రూపొందుతున్న మొట్టమొదటి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’స్ రివెంజ్” సిద్ధమవుతోంది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగభరితమైన అంబ పాత్ర కథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత యోగేంద్ర పొట్లూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాణి మాడిసన్ సహ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా, ఈ అద్భుత దృశ్యకావ్యానికి జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ చిత్రాన్ని నడిపిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యోగేంద్ర పొట్లూరి మరియు క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి సంయుక్తంగా మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ప్రయోగానికి తాము శ్రీకారం చుట్టామని ఎంతో సంతోషంగా వెల్లడించారు. ఈ “అంబ’స్ రివెంజ్” ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన ఏఐ టూల్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. కేవలం సాంకేతికత కోసమే కాకుండా విజువల్స్ రూపకల్పనలో మునుపెన్నడూ చూడని సరికొత్త శైలిని, ఏఐ సాంకేతికతతో పాత్రల ఆహార్యాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడంలో, ఆధునిక సాంకేతికత మరియు పౌరాణిక గాథల అద్భుత కలయికతో కథన నిర్మాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామని వారు స్పష్టం చేశారు. హనుమాన్ విజయోత్సవం వంటి మంచి రోజున ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వినూత్న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను, నటీనటుల మరియు ఇతర సాంకేతిక నిపుణుల సమాచారాన్ని చాలా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ఓ అశోక్ దయ్యాల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత పూర్తిస్థాయి కథాచిత్రాల దిశగా పడుతున్న ఈ అడుగును సినీ పెద్దలు అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ప్రాచీన పౌరాణిక గాథను, నేటి కాలపు అత్యాధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ చేస్తున్న ఈ అరుదైన ప్రయోగం ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకుల్లోనూ, అటు పరిశ్రమ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో సినిమా మేకింగ్ విధానాన్ని ఈ చిత్రం పూర్తిగా మార్చేస్తుందని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.