వేతనాలు పెంచాలని కోరుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతున్నది. సమ్మె కారణంగా బుధవారం షూటింగ్‌లు నిలిచిపోయాయి. సమ్మెకు మీరే కారణమంటూ అటు నిర్మాతల మండలి, ఇటు సినీ కార్మిక సమాఖ్య పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. సినీ కార్మికులకు 45 శాతం వేతనాలు పెంచితే గానీ చిత్రీకరణలకు హాజరు కాబోమని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని స్పష్టం చేశారు. కార్మిక నాయకులతో కలిసి ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..మేం సమ్మె కోరుకోవడం లేదు. ఇవాళ షూటింగ్స్ లేక 5 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేతనాలు పెంచాలని జనవరి నుంచి కోరుతున్నాం. గత నెల లిఖితపూర్వకంగా కోరాం. ఫైటర్స్, డాన్సర్స్ యూనియన్ సమస్యలను బూచిగా చూపిస్తూ నిర్మాతలు వేతనాల అంశం దాటవేస్తున్నారు.
సదరు యూనియన్లను ఒప్పించాం. అయినా స్పందన లేదు. మాకు వేతనాలు పెంచిన నిర్మాతల షూటింగ్స్‌కు మాత్రమే హాజరవుతాం. అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ..మా మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించింది కార్మిక సంఘాలే. ఇప్పుడు నోటీసు ఇవ్వకుండానే సమ్మెకు దిగారు. కార్మికులు తిరిగి షూటింగ్స్ హాజరయితేనే వేతనాల సమస్యపై మాట్లాడతాం. షూటింగ్స్ మొత్తం ఆగిపోయినా ఫర్వాలేదు. కార్మికులకు అన్యాయం చేయాలని ఏ నిర్మాత కోరుకోవడం లేదు. అని అన్నారు.
సమ్మెలో పాల్గొనడం లేదు: తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
బంజారాహిల్స్,జూన్ 22: తెలుగు ఫిలిం ఫెడరేషన్లో కొంత మంది కార్మికులు చేస్తున్న సమ్మెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఫెడరేషన్ కింద 24 విభాగాల్లో పని చేస్తున్న వారెవరూ సమ్మెలో పాల్గొనడం లేదు. సినీ కార్మికుల సమస్యలపై ఐకమత్యంగా పోరాడాల్సిన తరుణంలో తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతున్నది. తెలంగాణ సంఘాల పట్ల, కార్మికుల పట్ల వివక్షతను చూపిస్తున్నది. ఇలాంటి ధోరణి మానుకొని కలిసికట్టుగా పోరాడాలని సూచిస్తున్నాం. ఇలాంటి సమ్మెకు మా ఫెడరేషన్ మద్దతు ఉండదు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లలో తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, కోశాధికారి వజినేపల్లి ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.