విలన్లు హీరోలైపోవడం సినీచరిత్రలో రివాజు. అదే హీరోలు విలన్ పాత్ర చేయడమే నయా ట్రెండ్. పాత్ర డిమాండ్ చేసిందని కొందరు ప్రతినాయకుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. హీరోగా కెరీర్ ముగిసిందని భావించిన వాళ్లు ప్రతినాయక పాత్రకు సై అంటున్నారు. బాక్సాఫీస్ సూత్రాలను బలంగా విశ్వసించే దర్శక, నిర్మాతలు హీరోలకు విలన్ అవకాశాలిస్తూ… తమ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. కథానాయకులను.. ప్రతినాయకులుగా చూపించి కమర్షియల్ ఈక్వేషన్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.
విలన్లు హీరోలుగా మారడం టాలీవుడ్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఉన్నదే. కృష్ణంరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. విలన్‌గా కుదురుకొని ఆ తర్వాత హీరోగా నిలబడ్డాడు. మోహన్‌బాబు విలన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు. శ్రీకాంత్ సినీప్రస్థానం విలన్‌గా మొదలై హీరోగా విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీని దున్నేసిన నటులు విలన్లుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. మరికొందరు నాయకుడిగా సత్తా చాటుతూనే.. పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్ర వస్తే చేయడానికి సిద్ధం అంటున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ మొదలుకొని మాలీవుడ్ హీరో ఫహాద్ ఫాజిల్ వరకు విభిన్న తరహా విలనీ పాత్ర తారసపడితే తమ హీరో ఇజాన్ని పక్కనపెట్టి ప్రతినాయకుడి సవాలు స్వీకరిస్తున్నారు.
జవాన్‌కు.. లాజవాబ్ విలన్
తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు అందరివాడు అయ్యాడు. హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. విలక్షణ నటనతో పక్క రాష్ర్టాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయమయ్యాడు. కథానాయిక తండ్రి పాత్రలో ఆయన చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకుముందు తమిళంలో ‘విక్రం వేద’లో ప్రతినాయకుడిగా ప్రతి సీన్లోనూ మెప్పించాడు. అన్నిటికీ మించి కమల్‌హాసన్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబోలో వచ్చిన ‘విక్రమ్’ సినిమాలో విజయ్ సేతుపతి చూపించిన హావభావాలు రీల్స్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటే ఈ హీరో విలన్ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు. ఈ తరహా నటనే ఇప్పుడు సేతుపతిని బాలీవుడ్ బాద్ షాను ఢీకొట్టే రేంజ్‌కు తీసుకెళ్లింది. డిఫరెంట్ లుక్‌తో ఇప్పటికే థ్రిల్ పంచిన విజయ్.. హిందీ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
జగపతి బాబోయ్
ఫ్యామిలీ హీరోగా జగపతిబాబుకు ఒకప్పుడు శోభన్‌బాబుకు ఉన్నంత ఫాలోయింగ్ ఉండేది. హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో అయిష్టంగానే విలన్‌గా ఒప్పుకొన్నాడు. ‘లెజెండ్’ సినిమాలో విలనిజంతో జగపతి బాబోయ్ అనిపించుకున్నాడు. ఆపై వారసత్వ హీరోకు వరుస అవకాశాలు వెల్లువెత్తినట్టు జగపతిబాబు ముందు ప్రతినాయక పాత్రలు క్యూ కట్టాయి. రిచ్ విలన్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా, కన్నింగ్ ప్రెసిడెంట్‌గా ఏ పాత్రకైనా తానున్నానని దర్శకుల బుర్రలో సెటిలయ్యాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ తదితర చిత్రాలు ఈ హ్యాండ్సమ్ విలన్లోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. పుష్ప 2, సలార్, గుంటూరు కారం వంటి భారీ సినిమాల్లో ఈ విలన్ ఏ తరహా నటన పండించాడో వేచి చూడాలి.
పాత్రే ప్రాణం
విలక్షణ నటనకు నిర్వచనం కమల్‌హాసన్. ఆయన సినిమాల్లో కథే హీరో అనుకుంటాడు. ఆ తర్వాతే తన పాత్రతీరుతెన్నులు. కెరీర్ మొదట్లో విలనీ టచ్ ఉన్న పాత్రలు ఎన్నో చేశాడు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు. ప్రతినాయక పాత్రలో ‘నాయకుడు’గా నటించి మెప్పించాడు. ‘అభయ్’లో భారీ విలన్‌గా దర్శనమిచ్చాడు. ఆయనకు కథ డిమాండ్ చేయడం ప్రధానం. మళ్లీ చాలా ఏండ్ల తర్వాత నాగ్ అశ్విన్ ఆ తరహా పాత్రతో కమల్‌ను కలిశాడు. ‘ప్రాజెక్ట్ కె’లో ప్రతినాయకుడి పాత్రకు అడిగాడు. కథ నచ్చింది, తన పాత్ర మరింత నచ్చింది.. ఏముంది ఈ యూనివర్సల్ స్టార్ విలన్‌గా చేయడానికి మీనమేషాలు లెక్కించలేదు. వెంటనే ఓకే అన్నాడు.
దశాబ్దాలుగా హీరోగా కనిపించిన కమల్‌ను త్వరలోనే ఫుల్‌లెంగ్త్ విలన్‌గా చూడబోతున్నామన్నమాట!పార్టీ ముందుంది పుష్పా! తెలుగు సినిమా అభిమానులకు ఫహాద్ ఫాజిల్ అంటే ఆయనెవరు అని తికమకగా చూస్తారు! అదే భన్వర్ సింగ్ షెకావత్ అంటే… ఓ అతగాడా అని ఆదరంగా బదులిస్తారు. ‘పార్టీ లేదా పుష్ప’ అని ఒక్కుమ్మడిగా పలుకుతారు. తాజాగా ఓటీటీలో విడుదలైన ‘మామన్నన్’ సినిమా ఫాజిల్ విలనిజాన్ని ఎంత షార్ప్‌గా పండిస్తాడో పరిచయం చేసింది. పుష్ప 2లో భన్వర్‌సింగ్ పాత్ర రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిసిందే! పుష్ప హిట్‌తో ఫాజిల్‌ను మరిన్ని విలన్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
సలార్ సలామ్
ఓటీటీ రాకతో భాషకు మేర లేకుండా పోయింది. ఏ భాషా చిత్రమైనా హిట్ టాక్ వచ్చిందంటే చూసేస్తున్నారు. అలా మలయాళ చిత్రాలు చూస్తున్నవారికి బాగా తెలిసిన పేరు పృథ్వీరాజ్ సుకు మారన్. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో విలనీ ఛాయలున్న కోషి కురియన్ పాత్రలో అదరగొట్టాడు. అంతకుముందు మాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా ఎన్నో పాత్రలు చేసిన ఆయనకు.. ‘అయ్యప్పన్..తో ఆల్ ఇండియా పాపులారిటీ వచ్చింది. ఇంత వరకూ ఎలా ఉన్నా.. ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’లో రగ్గ్డ్ విలన్‌గా కనిపిస్తున్నాడు పృథ్వీ. ఇప్పటికే విడుదలైన లుక్.. పాత్ర తీరుతెన్నులు ఎంత రఫ్‌గా ఉంటాయో చెప్పకనే చూపింది. ‘కేజీఎఫ్’లో ప్రతినాయకుడిని కథానాయకుడి కన్నా గొప్పగా చూపిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. పృథ్వీని ఏ రేంజ్లో చూపిస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు.
అందరూ విలన్లే..
హీరోలుగా సక్సెస్ సాధించి.. విలన్లుగా రాణిస్తున్న నటులు మరింతమంది ఉన్నారు. ఈ వరుసలో ఆది పినిశెట్టి ముందుంటాడు. విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆది.. ‘సరైనోడు’ సినిమాలో విలన్‌గా అంచనాలకు మించి అదరగొట్టాడు. ‘ద వారియర్’ సినిమాలోనూ విలన్‌గా మార్కులు కొట్టేశాడు. విలన్ నుంచి హీరోగా ఎదిగి మళ్లీ విలన్ అవకాశాలను అందుకున్న నటుడు శ్రీకాంత్. ‘అఖండ’ సినిమాలో షాకింగ్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘వారసుడు’ సినిమాలోనూ విలన్ ఛాయలున్న పాత్ర చేశాడు. ప్రతినాయకుడి పాత్రతో పలు స్క్రిప్ట్‌లు శ్రీకాంత్‌ను పలకరిస్తున్నాయని టాక్. ‘ఆర్ఎక్స్ 100’తో యువతుల మతులు చెదరగొట్టిన హీరో కార్తికేయ. హీరోగా పయనిస్తూనే అడపాదడపా విలన్ క్యారెక్టర్లోకి తొంగిచూస్తున్నాడు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అజిత్ హీరోగా నటించిన ‘వాలిమై’లో విలన్‌గా మెరుపువేగంతో దూసుకుపోయాడు. ‘రోజా’ నాటి అందగాడు అరవిందస్వామి ‘ధృవ’లో మైండ్ గేమ్‌తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏదైతేనేం.. ఒకప్పుడు హీరోలుగా ఆరాధించిన నటులను విలన్లుగా కూడా ఆదరిస్తాం అంటున్నారు వారివారి అభిమానులు.