Telugu Zee5 | వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5, తన తదుపరి ఒరిజినల్ వెబ్ సిరీస్ “మేము ‘కాప్’లం” స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది. గ్రామీణ నేపథ్యంలో కామెడీ మరియు మిస్టరీ కలయికతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులకు త్వరలోనే సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇటీవలే విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో గెటప్ శ్రీను, జాఫర్ తమదైన శైలిలో కనిపించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచారు.
గోదావరి జిల్లాల్లోని ఒక పల్లెటూరు, అక్కడ జరిగే సంక్రాంతి సంబరాల మధ్య ఒక వింత ఘటన చోటుచేసుకుంటుంది. ఆ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసులకు అది వారి కెరీర్లోనే మొదటి పెద్ద కేసు కావడం విశేషం. వారు ఆ కేసును పరిష్కరించే క్రమంలో ఎదురయ్యే గందరగోళం, దొరికే వింత క్లూస్ మరియు అక్కడి స్థానిక రాజకీయాలు కథను ఎంతో ఆసక్తికరంగా మార్చనున్నాయి. రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన గత సిరీస్ ‘పరువు’ విజయం తర్వాత మళ్లీ జీ5తో కలిసి పనిచేయడం, అందులోనూ ఇలాంటి అర్థవంతమైన హాస్యంతో కూడిన కథలో భాగమవ్వడం సంతోషంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.