Taapsee Pannu Movies| కెరీర్ బిగెనింగ్ నుండి రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతుంది తాప్సీ పన్ను. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఏకంగా ప్రభాస్‌తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తాప్సీ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరుగలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఈమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ఈమెకు తెలుగులో అవకాశాలు కరువైపోయాయి. ఈ క్రమంలో తాప్సీ బాలీవుడ్‌కు మకాం మర్చింది. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు తాప్సీ నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు తాప్సీ కెరీర్ గాడి తప్పింది. కరోనాకు ముందు ఫైర్ క్రాకర్‌లా వెలిగిపోయిన తాప్సీ కెరీర్.. కరోనా తర్వాత నేల రాలిన రాకెట్లా మారింది.
ఈ మధ్య తాప్సీ నటించిన సినిమాలన్ని దాదాపు ఓటీటీ బాట పడుతున్నాయి. ఒకటీ రెండు సినిమాలు థియేటర్లో రిలీజైన అవి పెద్దగా వర్కవుట్ కాలేకపోయాయి. దాంతో ఈమె కెరీర్ కష్టాల్లో పడిందని బీ-టౌన్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. కోవిడ్ ముందు వరకు తాప్సీ వరుస హిట్లతో దూసుకుపోయింది. కానీ కోవిడ్ తర్వాత హిట్టే కరువైంది. కోవిడ్ టైమ్‌లో ఈమె నటించిన ‘హసీన్ దిల్రూబా’ ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రియుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈమె నటించిన సినిమాలు వరుసగా ఓటీటీ బాట పడ్డాయి. అయితే హసీన్ దిల్రూబా తర్వాత తాప్సీ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
‘మిషన్ ఇంపాజిబుల్’, ‘శభాష్ మిథు’ వంటి సినిమాలు థియేటర్లో రిలీజైన.. అవి కాస్త ఫ్లాపులుగా మిగిలాయి. ఇక ప్రస్తుతం తాప్సీ ఆశలన్ని ‘బ్లర్’ పైనే ఉన్నాయి. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తాప్సీ నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఈ చిత్రం కూడా ఓటీటీ మార్గాన్నే ఎంచుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి.. తాప్సీ ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. మరీ ఈ సినిమాతోనైనా తాప్సీ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందా? లేదా? అనేది చూడాలి.