న్యూఢిల్లీ: క్రికెటర్ కేఎల్ రాహుల్.. అతియా శెట్టిలు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరికీ ఈ నెలలోనే వెడ్డింగ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే హీరో సునీల్ శెట్టి ఇంట్లోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫార్మౌజ్లో రాహుల్-అతియాలు ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం ఉంది. కేవలం కుటుంబసభ్యల మధ్య మాత్రమే ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబైలోని పాలి హిల్లో ఉన్న కేఎల్ రాహుల్ ఇంటిని లైట్లతో డెకరేట్ చేశారు. దీంతో సంబరాలు మొదలైనట్లు అభిమానులు భావిస్తున్నారు. ఇక సునీల్ శెట్టి ఖండాలా ఇంటి గురించి ఇటీవల ఓ వీడియో రిలీజ్ అయ్యింది. ఏషియన్ పేయింట్స్ ఆధ్వర్యంలో ఆ వీడియో రిలీజైంది. ఖండాలాలో ఉన్న ఆ ఇంటికి జహాన్ అని పేరు పెట్టారు. కొండల్లో ఉన్న ఆ ఇంటి దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. ఇక్కడే రాహుల్, అతియాల పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. సునీల్ శెట్టి కూతురే అతియా శెట్టి.