Sumanth | అక్కినేని కుటుంబ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని మూడో తరం కథానాయకుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హీరో సుమంత్. మొదటి నుంచీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే విభిన్నమైన కథలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే సుమంత్.. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సుమంత్ తన సినీ ప్రయాణంతో పాటు తాత అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం, నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహం, కెరీర్లో మిస్ అయిన సినిమాలు, తన వ్యక్తిగత అలవాట్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిన్నతనంలో తన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లాల్సి రావడంతో తాత అక్కినేని నాగేశ్వరరావు తనను దత్తత తీసుకుని సొంత కొడుకులా పెంచారని సుమంత్ గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను నేర్పిస్తూనే.. చదువు, కెరీర్ విషయంలో తన నిర్ణయాలను తానే తీసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారని చెప్పారు.తన వ్యక్తిత్వం, ఆలోచనా విధానంపై నాగేశ్వరరావు ప్రభావం ఎంతో ఉందని సుమంత్ తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే నటన వైపు అడుగులు వేసినట్లు వెల్లడించారు. మరోవైపు మామయ్య నాగార్జున కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎంతో సహకరించారని చెప్పారు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, నటనలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునేలా నాగార్జున సూచనలు ఇచ్చేవారని, నటుడిగా ఎదగడానికి ఆయన ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందని సుమంత్ పేర్కొన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ప్రేమకథ’ సినిమాతో సుమంత్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సినిమాలో హీరో పాత్రకు విషాదాంతం ఉండటంతో ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా.. సుమంత్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తన కెరీర్లో మిస్ అయిన సినిమాల గురించి కూడా సుమంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వే కావాలి’ కథ తనకు ఎంతో నచ్చిందని, ఆ సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో చేయలేకపోయానని చెప్పారు.‘నువ్వే కావాలి’ వంటి విజయవంతమైన సినిమా వదులుకోవడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని సుమంత్ తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దేశముదురు’ కథ కూడా మొదట తన వద్దకు వచ్చిందని వెల్లడించారు. అయితే ఆ పాత్రను తాను చేసి ఉంటే సినిమాకి అల్లు అర్జున్తో వచ్చినంత ప్రభావాన్ని చూపించి ఉండకపోవచ్చని సుమంత్ నిజాయతీగా చెప్పడం విశేషం.