కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సిలిండర్లు కొనుగోలు చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన ఆజాద్ ఫౌండేషన్‌కు అందజేశారు. త్వరలోనే మరిన్ని ఆక్సిజన్ సిలిండర్లను అందించాలని సుకుమార్ నిర్ణయించారు. కొవిడ్ బాధితులు ఆక్సిజన్ కొరత కారణంగా మరణించకూడదనే ఉద్దేశ్యంతో సుకుమార్ ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమలాపురంకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లతో ఆక్సిజన్ కొరత విషయమై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు సుకుమార్. ఆయన సేవాగుణాన్ని తెలుగు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.