బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్, విక్కీకౌశల్ మరికొద్ది గంటల్లో వివాహబంధంతో ఏకమవ్వబోతున్నారు. గురువారం ఈ జంట పెళ్లి జరుగనున్నది. రాజస్థాన్‌లోని భర్వారా కోట సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌ను పెళ్లి ఘట్టం కోసం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం నుంచి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. తొలుత వివాహ వేడుక కోసం వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటుచేసినట్లు తెలిసింది. బుధవారం మోహందీ వేడుకను నిర్వహించారు. ప్రముఖ మెహందీ డిజైనర్ వీణా వధూవరుల చేతులను గోరింటాకుతో అందంగా అలంకరించారు. ఈ మెహందీ వేడుకలో విక్కీ, కత్రినాకైఫ్ కుటుంబసభ్యులు పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం హల్దీ సంబరాల్ని జరిపారు. బుధవారం రాత్రి సంగీత్ వేడుకలను నిర్వహించబోతున్నారు. పంజాబీ శైలి గీతాలతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇందులో పంజాబీ, ఆర్డీబీ గీతాలకు కత్రిన, విక్కీ డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.కత్రినాకైఫ్, విక్కీకౌశల్ల పెళ్లికార్డు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. గోల్డ్, పింక్ కలర్స్‌లో అందంగా తీర్చిదిద్దిన ఈ కార్డ్ తాలూకు ఫొటోలను పలువురు నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హిందూ, పాశ్చత్య సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగనున్నది.