సినీ ప్రముఖుల వరుస మరణాలు అభిమానులని ఎంతగా బాధిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి మరణం గురించి మరచిపోకముందే మరొకరు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఎన్టీఆర్ పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందగా, ఆయన మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) చెన్నైలో కన్నుమూశారు. వయస్సు మీద పడడంతో తలెత్తిన సమస్యల కారణంగా ఆయన మృతి చెందారు.
తనతో కలిసి భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో శ్రీకాంత్ పని చేశారని చెప్పిన రజనీకాంత్ .. స్నేహితుడి మరణం చాలా బాధించిందని స్పష్టం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ సినిమాలతో శ్రీకాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మృతి చాలా మంది ప్రముఖులకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.