Sree Vishnu | టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ఎలాంటి కథ అయినా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసే ఆయన.. ప్రస్తుతం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు తన కెరీర్, సినిమాల ఎంపిక, వ్యక్తిగత స్వభావం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒక విభిన్నమైన అడవి నేపథ్యంతో సాగే హిలేరియస్ ఎంటర్టైనర్ అని శ్రీ విష్ణు చెప్పాడు. ఇలాంటి నేపథ్యంతో కామెడీని పండించడం చాలా అరుదని, కథ వినగానే తనకు బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పినట్లు వెల్లడించాడు.
సినిమాకు సహజత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కువగా నిజమైన ప్రదేశాల్లోనే షూటింగ్ చేసినట్లు చెప్పాడు. అడవిలోకి కారవాన్లు వెళ్లేందుకు కూడా మార్గం లేకపోవడంతో ప్రతిరోజూ దాదాపు 30 నిమిషాల పాటు నడుచుకుంటూ షూటింగ్ ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నాడు. అలా రోజూ అడవిలో నడవడం, అక్కడే షూటింగ్ చేయడం శారీరకంగా చాలా అలసటకు గురిచేసిందని చెప్పాడు. తన కెరీర్లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నకు శ్రీ విష్ణు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పెద్ద దర్శకులతో సినిమా చేస్తే ఒక రకంగా భద్రత ఉంటుందని, అయితే వారికి ఇప్పటికే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే కొంత అంచనా వేసే అవకాశం ఉంటుందని చెప్పాడు.
అదే కొత్త దర్శకులతో పనిచేసినప్పుడు కథ ఎలా ఉంటుంది? దర్శకుడు ఎలాంటి కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుందని శ్రీ విష్ణు అభిప్రాయపడ్డాడు. అందుకే తనకు కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడూ ఇష్టపడతానని వివరించాడు. సినిమా సెట్స్‌లో హీరోయిన్లు, ఇతర సహనటులతో శ్రీ విష్ణు పెద్దగా మాట్లాడరని, చాలా సైలెంట్‌గా ఉంటారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. దీనిపైనా ఆయన స్పందించాడు. తాను మొదటి నుంచే కొంచెం రిజర్వ్డ్గా ఉంటానని చెప్పాడు. అందుకే సినిమా ప్రారంభమైనప్పుడే హీరోయిన్లకు, ఇతర సహనటులకు తన స్వభావం గురించి ముందుగానే చెబుతానని వెల్లడించాడు. లేకపోతే తాను ఎక్కువగా మాట్లాడకపోవడాన్ని వాళ్లు పొరపాటుగా తన ఆటిట్యూడ్‌గా భావించే అవకాశం ఉందని చెప్పాడు. అందుకే ముందుగానే తన గురించి చెప్పి అందరినీ కంఫర్ట్‌గా ఉండేలా చేస్తానని నవ్వుతూ వివరించాడు. ఖాళీ సమయం దొరికితే సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడతానని శ్రీ విష్ణు చెప్పాడు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ సినిమా తనకు బాగా నచ్చిందని వెల్లడించాడు. ఇండస్ట్రీలో పార్టీలకు, ఫంక్షన్లకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకునే శ్రీ విష్ణు.. తన సినిమాల విషయంలో మాత్రం ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడూ ముందుంటాడు.