VedanControversy | లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాపర్ వేదన్కు రాజకీయ అవకాశలు కల్పించడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా మండిపడ్డారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే), ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీలు వేదన్ను తమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన చిన్మయి, మీటూ ఉద్యమం సమయంలో పలువురు మహిళలు వేదన్పై లైంగిక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి ప్రధాన రాజకీయ పార్టీలు వేదిక ఇవ్వడం బాధితులను మరింత కించపరిచినట్లేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పార్టీలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు దూరంగా ఉండాలని, లేకపోతే అది తప్పుడు సంకేతాలను పంపినట్లు అవుతుందని చిన్మయి పేర్కొన్నారు. వేదన్కు వ్యతిరేకంగా గతంలో వచ్చిన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అతడిని రాజకీయ సభల్లో గౌరవించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో టీవీకే, డీఎంకే పార్టీలు స్పష్టత ఇవ్వాలని, బాధితుల పక్షాన నిలబడాలని చిన్మయి డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.