Shruti Haasan | ఈ ఏడాది ప్రారంభంలో ఒకేసారి రెండు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి ‘భళా’ అనిపించేశారు శృతిహాసన్. చిత్రమేంటంటే.. ఆ తర్వాత ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రభాస్ ‘సలార్’, నాని ‘హాయ్ నాన్న’ ప్రస్తుతం ఆమె చేతిలోవున్న సినిమాలు. నిజానికి ‘సలార్’ ఈ నెల 28న విడుదల కావాల్సింది. కొన్ని కారణాలవల్ల వాయిదాపడింది. ఇదిలావుంటే.. శృతిహాసన్ సోషల్‌మీడియాలో కూడా చురుగ్గా వుంటారు. ఈ క్రమంలోనే రీసెంట్గా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారామె.
వాళ్లడిగిన పలు ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలిచ్చారు. శంతన్తో ప్రేమవ్యవహారం ఎందాకా వచ్చింది? అసలు తనెలా పరిచయమయ్యాడు? ఇంతకీ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ “ ఇన్‌స్టా ద్వారానే పరిచయమయ్యాడు. తను బొమ్మలు బాగా గీస్తాడు. అతని ఆర్ట్స్ నచ్చి నేనే పరిచయం చేసుకున్నాను. అలా మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ప్రస్తుతం ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తున్నాను. దయచేసి పెళ్లీ గిల్లీ అంటూ బోరింగ్ ప్రశ్నలొద్దు” అని సున్నితంగా సమాధానమిచ్చారు శృతి.