కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. ఆయన నటిస్తున్న పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది. అగ్ర హీరో మహేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ మహా దర్శకుడు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ బుధవారం పాత్రికేయులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్ అనుకున్నామని, మహేష్‌బాబు కూడా సినిమా చూసిన తర్వాత అదే ట్యాగ్‌లైన్ చెప్పారని సత్యదేవ్ గుర్తుచేశారు. ‘సినిమాలో నా పాత్ర పేరు రామప్ప. నా గత చిత్రాలతో పోల్చితే రెండింతలు ఎక్కువగా ఈ సినిమా కోసం కష్టపడ్డా. హేవీ మేకప్‌తో కూడుకున్న పాత్ర కాబట్టి షూటింగ్‌కు రెడీ కావడానికే చాలా సమయం పట్టేది’ అన్నారు సత్యదేవ్.
1960-99 మధ్య జరిగే కథ ఇదని, ఇందులో కథానాయకుడు రామప్ప దేశసంచారిగా కనిపిస్తాడని, అతను అనుకోకుండా భువనాలయం అనే ప్యాలెస్‌కి వచ్చినప్పుడు ఏం జరిగిందన్నదే సినిమా ఇతివృత్తమని సత్యదేవ్ పేర్కొన్నారు. సినిమాల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి చెబుతూ ‘ఓ ప్రేక్షకుడిగా నేను సినిమాను జడ్జ్ చేస్తాను. నా నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు దాని కోసం ఎందుకు ఎదురుచూడాలనే ప్రశ్న వేసుకుంటాను’ అని చెప్పారు.