సమ్మర్ సీజన్ బిగ్ టికెట్ మూవీగా విడుదలకు వస్తున్నది మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’. పాటలు ఛాట్ బస్టర్స్ అవడం, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటం సినిమా మీద అంచనాలు పెంచుతున్నది. అభిమానులు కోరుకునే హీరోయిజం, ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ అంశాలు ఉన్న ఈ సినిమా మే 12న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను హీరో మహేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో వివరించారు.
‘సర్కారు వారి పాట’ ట్రైలర్ బాగుందన్న ప్రశంసలపై మీ స్పందన ఏంటి?
నేను ఇష్టపడి చేసిన చిత్రమిది. నటించేప్పుడు, డైలాగ్స్ చెప్పేప్పుడు మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్‌ను ఆస్వాదించాను. కొన్నిసార్లయితే పోకిరి సినిమా రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్‌కు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది.
అప్పుల రికవరీ అంటేనే ఆ పాత్రలో ఒక హీరోయిజం ఉంటుంది. ఈ స్కోప్ నటించేప్పుడు ఎంతవరకు ఉపయోగపడింది?
థీమ్ కొంతవరకు మీరు చెప్పినట్లే ఉన్నా క్యారెక్టరైజేషన్ దర్శకుడు పరశురామ్ కొత్తగా డిజైన్ చేశారు. ఆయన కథ చెబుతున్నప్పుడే నేను ఎైగ్జయిట్ అయ్యాను. నేను ఇలాంటి స్టోరీ చేసి చాలా రోజులవుతున్నది. కథే సినిమాను నడిపిస్తుందని నమ్మే హీరోను నేను. కథలో హీరో క్యారెక్టర్ ఎలా ప్రవర్తించాలో నేనూ ఆ పరిధిలోనే నటిస్తా. అయితే ఈ సినిమాలో అలాంటి పరిధి దాటి బయటకొచ్చి నటించే అవకాశం దొరికింది. ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేశాను.
గత నాలుగేళ్లుగా నేను ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టరే అన్నారు కదా..! నటుడిగా నేను పరిణితి చెందాను అనుకుంటాను. కథల ఎంపికలో ఆ అనుభవం పనికొస్తున్నది. అదృష్టం కొద్దీ మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా నా జర్నీ చాలా బాగుంది.
ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘పోకిరి’ గుర్తొంచిందని అన్నారు ఎందుకని?
‘పోకిరి’ సినిమాలో ఒక మాస్ ఉంటుంది, థియేటర్లో అదో సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆ చిత్రాన్ని పోలినట్లు కాదు గానీ ఆ షేడ్స్‌లో ఉంటుంది. కాబట్టి ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయని చెప్పాను.
దర్శకుడు పరశురామ్ పనితనం గురించి ఏం చెబుతారు ?
దర్శకుడు పరశురామ్లో మంచి రచయిత ఉన్నాడు. దర్శకుడిలో రచయిత ఉంటే ఆ సినిమా బాగుంటుందని నమ్ముతాను. పరశురామ్లో ఆ ప్రతిభ ఉంది.
బ్యాంకుల మొండి బకాయిలు చాలా సీరియస్ ఇష్యూ, కానీ పూర్తిగా ఎంటర్టైనింగ్గా చెప్పినట్లున్నారు.?
నా గత రెండు మూడు సినిమాలు సందేశాత్మకంగా రూపొందాయి. ఈ చిత్రంలో మహేష్ చాలా స్వేచ్ఛగా నటించాడు, ఫ్రెష్‌గా ఉన్నాడు అంటున్నారు. కొన్ని మంచి విషయాలు ఇందులోనూ ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. సినిమాలో సందేశాలు చెప్పాలని నేననుకోను. కథలో అవి కుదిరితే ఓకే.
పాండమిక్‌లో చుట్టూ ప్రతికూల పరిస్థితులు చూస్తూ..సెట్లో అంత ఉత్సాహంగా ఎలా నటించగలిగారు?
అదొక చాలెంజ్ అనిపించింది. కొద్ది రోజులు విదేశాల్లో షూటింగ్ చేసి విరామం తీసుకున్నాం, ఆర్నెళ్ల తర్వాత ఎక్కడ ఆపామో మళ్లీ అక్కడి నుంచి మొదలుపెట్టాం. మధ్యలో వేరే పోర్షన్స్ చిత్రీకరణ జరిపాం. చుట్టూ పరిస్థితులు బాగా లేకున్నా, దర్శకుడు, ఇతర టీమ్ మెంబర్స్ బాగా ప్లాన్ చేశారు. అదే ఉత్సాహంగా నటించేలా చేసింది.
ట్రైలర్లో ఉన్న కొన్ని డైలాగ్స్ చెప్పేందుకు ఎప్పుడైనా సందేహించారా?
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎలా వ్యవహరిస్తాయో, అలాగే నటించాల్సి ఉంటుంది, డైలాగ్స్ చెప్పాల్సివస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో నా క్యారెక్టరైజేషన్‌కు తగినట్లే ఆ మాటలు ఉన్నాయనుకుంటాను. సినిమా కథాగమనంలో చూస్తే ఆ డైలాగ్స్ ఇబ్బందిగా అనిపించవు.
అభిమానులకు నచ్చే సినిమాలే చేస్తానని చెప్పారెందుకని?
ప్రస్తుతం సినిమా బడ్జెట్స్ బాగా పెరిగిపోయాయి. నా స్టార్డమ్కు అభిమానులతో పాటు ప్రేక్షకులందరికి నచ్చే సినిమాలే చేయాలి. పూర్తిగా ఆఫ్ బీట్‌గా వెళ్లి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే వర్కవుట్ కాదు. అందుకే వాణిజ్య విలువలున్న చిత్రాలు ఎంచుకుంటున్నా.
తమన్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. మీ ఫేవరేట్ సాంగ్ ఏది?
సినిమాల గురించి రాస్తూ తమన్ నేపథ్య సంగీతం గురించి రాయడం నేను చూశాను. సంగీత దర్శకుడిగా పరిణితి సాధించాడు. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. కళావతి నా ఫేవరేట్ సాంగ్.
పాన్ ఇండియా సినిమాలు చేయడంపై మీ అభిప్రాయం..
నా ప్రాధాన్యత టాలీవుడ్‌నే. అయితే మన సినిమాలు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాయని పదేళ్ల ముందే చెప్పాను. అది ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆ తరహా సినిమాలు చేయొద్దని కోరుకోవడం లేదు.
దేశీయంగా పెరిగిన తెలుగు సినిమా ప్రభావంపై మీరేమంటారు?
మన ఎమోషన్స్‌కు, మనదైన కథలకు కట్టుబడి గొప్ప చిత్రాలు రూపొందిస్తున్నాం. అందుకే అవి జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. మన సినిమా విస్తృతి పెరిగినప్పుడు బడ్జెట్స్, స్థాయి సహజంగానే పెరుగుతాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది?
త్రివిక్రమ్ క్రియేట్ చేసిన సన్నివేశాల్లో నటిస్తుంటే, ఆయన రాసిన డైలాగ్స్ చెబుతుంటే ఆ ఫీలింగ్ వేరు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు వేచి చూస్తున్నాను. అది ఏ తరహా సినిమా అనేది ఇప్పుడే బయటకు చెప్పలేను.
రాజమౌళి సినిమాలో మూడేళ్లు స్టక్ అవ్వాలేమో అనిపిస్తుందా?
ఆయనతో ఒక్క సినిమా చేస్తే పాతిక చిత్రాలకు చేసిన సంతృప్తి, సంతోషం దొరుకుతాయి. మూడేళ్లయినా టైమ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
మీ పిల్లలు సితార, గౌతమ్ కెరీర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
ఇవాళ్టి పిల్లలు చెబితే వింటున్నారా. సితార నటిస్తాను అంటుంది. గౌతమ్ బాగా చదువుకోవాలని అనుకుంటున్నాడు. వాళ్లు ఏ కెరీర్ కోరుకున్నా నా గైడెన్స్ ఉంటుంది.
సినిమాలో అమెరికా నేపథ్యం పెట్టడానికి కారణం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేందుకేనా..?
లేదు, కథలోనే యూఎస్ నేపథ్యం ఉంది. మొదటి భాగం సినిమా అమెరికాలో జరిగి, ద్వితీయార్థానికి వైజాగ్‌కు వస్తుంది