Sridevi Shoban Babu Movie | బోలెడంత టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే శోభన్‌బాబు కనీసం ఒక్క హిట్టయినా సాధించేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అరుదు. అలాంటిది సుడి ఎక్కడో బాగుండి ఆఫర్లు వస్తే వాటిని ఎలా వాడుకోవాలో తెలియడం సగటు నటుడి లక్షణం. ఈ విషయంలో మాత్రం శోభన్‌బాబు లెక్క తప్పాడు. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేసేయడం వల్ల క్రేజ్ తగ్గడం తప్పితే మరేమి లేదు. సరే చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కనీసం రిలీజ్ డేట్ల విషయంలోనైనా కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.
అసలే చిన్న సినిమాలు, ఎక్కువగా థియేటర్లు దొరకవు. అలాంటప్పుడు సోలోగా రిలీజైతే కాస్తో కూస్తో హిట్టయ్యే అవకాశాలుంటాయి. కంటెంట్ మీద ఉన్న గుడ్డి నమ్మకంతో రిలీజ్ చేస్తే చేతులు కాల్చుకోకతప్పదు. గతేడాది అలాగే దసరాకు బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ అనే సినిమాను ‘గాడ్‌ఫాదర్’, ‘ఘోస్ట్’ వంటి సినిమాలకు పోటీగా రిలీజ్ చేశాడు. మంచి కథ, కథనం ఉన్న సినిమా మరుగున పడిపోయింది. అదే విధంగా ఈ సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’తో అనవరమైన రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేశారు. చివరికి డిజాస్టర్‌గా మిగిలింది. ఇన్నీ ఎగ్జామ్పుల్స్ ఉండగా మరోసారి రిస్క్‌కు సిద్ధమయ్యాడు సంతోష్ శోభన్.
ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితా కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్‌కుమార్ దిమ్మెల దర్శకత్వం వహించాడు. అప్పుడెప్పుడో ‘ఆచార్య’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. మళ్లీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. కాగా తాజాగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా బానే ఉంది కానీ, హఠాత్తుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇలా పోటీగా రావడం వెనుక మేకర్స్ స్ట్రాటజీ ఎంటో అంతుచిక్కడం లేదు. ఫిబ్రవరి 17న ‘సార్’ ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ఎలాంటి బజ్లేదు. కానీ సితార సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దాంతో కావలిసినంత బజ్ వారంలోనే వస్తుంది. ఇక అదే రోజున కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లు గతనెల నుండే మొదలయ్యాయి. ప్రతీ వారం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ను ప్రకటిస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటున్నారు. పైగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది గీతాఆర్ట్స్ సంస్థ. ఈ లెక్కన చూసుకుంటే మేనమామతోనే సుస్మిత పోటీకి సిద్ధమవుతుంది.
ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు వారం ముందు కళ్యాణ్‌రామ్ ‘అమిగోస్’తో వస్తున్నాడు. మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. బింబిసార లాగా మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే ఈ సినిమా ప్రభావం రెండు వారాలు ఈజీగా ఉంటుంది. పైగా ఈ సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో మైత్రీ నుండి వచ్చిన ప్రతీ సినిమా హిట్టే. ఈ లెక్కన అమిగోస్‌కు కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే శోభన్‌బాబుకు కష్టాలు తప్పవు.
నిజానికి సంతోష్ శోభన్ మార్కెట్ ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఆయన సినిమాలు కనీసం 5కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోతున్నాయి. పైగా సంతోష్ గత మూడు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇలాంటి టైమ్‌లో సోలో డేట్‌ను వెతుక్కోక.. పోటీకి దిగడం అంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. చూడాలి మరి ఈ సారైనా సంతోష్‌కు కలిసొస్తుందా లేదా అనేది.