ఇన్నాళ్లూ అందం, అభినయంతో ఆకట్టుకున్న మలయాళమందారం సంయుక్త మీనన్ ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోకి మారింది. ప్రస్తుతం ఆమె ‘ది బ్లాక్ గోల్డ్’ అనే లేడీ ఓరియెంటెడ్ పానిండియా యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ని ఆమె డూప్ లేకుండా చేస్తూ చిత్రయూనిట్‌ని ఆశ్చర్యానికి లోను చేస్తున్నది. ఈ విషయాన్ని గురువారం ఓ ప్రకటన ద్వారా చిత్రయూనిట్ తెలియజేశారు.
గాయాలను సైతం పట్టించుకోకుండా సంయుక్త చేస్తున్న పోరాటాలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని, సంయుక్త కెరీర్లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలువనున్నదని ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఈ సమ్మర్లోనే తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పానిండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో నాజర్, మురళీశర్మ, రావు రమేశ్, మనీష్ వాద్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.