Sankranthi Movies | ఇప్పుడెక్కడ విన్నా సంక్రాంతి సినిమాల గురించే చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 5 సినిమాలు వస్తుండటంతో ఇటు నిర్మాతలు.. అటు డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర పట్టడం లేదు. కంగారుతో ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు.. టెన్షన్‌తో నరాలు కట్ అయ్యేలా ఉన్నాయి వాళ్లకు. చూసే అభిమానులు కూడా అదే రేంజ్ టెన్షన్ అనుభవిస్తున్నారు. అయితే ఇంత కంగారులోనూ గత జ్ఞాపకాలను తలుచుకుని హాయిగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. ఏడాది మొదటి పండగ.. అందులోనూ సంక్రాంతిని సినిమా పండుగ అంటారు.. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే ఓ మొండి నమ్మకంతో వచ్చేస్తున్నారు.
ఈ సారి వస్తున్న సినిమాల్లో మహేశ్ బాబు గుంటూరు కారం సోలోగా 150 కోట్ల బిజినెస్ టచ్ చేస్తుంది. త్రివిక్రమ్ కూడా ఉన్నాడు కాబట్టి హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మరోవైపు మిగిలిన 4 సినిమాలు కలిపి 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు ఒకేసారి వస్తున్నా కూడా గత సంక్రాంతులు చేసిన మ్యాజిక్ తలుచుకుంటున్నారు నిర్మాతలు. 2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు వచ్చాయి. మూడూ పెద్ద సినిమాలే.. అంత పోటీలో వచ్చి ఈ మూడూ విజయం సాధించాయి. దీన్నిబట్టి పండక్కి ఎంత స్టామినా ఉందనేది మరోసారి ప్రూవ్ అయింది. చిరు సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. బాలయ్య 130.. విజయ్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేశారు.
2020 సంక్రాంతికి కూడా ఇదే జరిగింది. అప్పుడు సరిలేరు నీకెవ్వరుతో మహేశ్ బాబు వస్తే.. అల వైకుంఠపురములో అంటూ అల్లు అర్జున్ వచ్చాడు. ఈ రెండు సినిమాలు కలిపి 450 కోట్ల బిజినెస్ చేశాయి. దానికి ముందు 2017లోనూ ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు పండక్కి మంచి విజయం సాధించాయి. ఖైదీ నెం 150, శాతకర్ణి లాంటి పెద్ద సినిమాల మధ్య కంటెంట్‌తో కొట్టి చూపించింది శతమానం భవతి. ఈ రెండు సినిమాల కంటే దానికే ఎక్కువ లాభాలు వచ్చాయి. మరోవైపు 2016లోనూ ఇలాంటి సీనే జరిగింది. ఆ పండక్కి సోగ్గాడే చిన్నినాయనా, నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు హిట్ అయ్యాయి. బాలయ్య డిక్టేటర్ కూడా పర్లేదు అనిపించింది.
2016, 2017, 2020, 2023 సంక్రాంతులు ఇచ్చిన బూస్టప్‌తో 2024లోనూ ఇదే సీన్ కంటిన్యూ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. పండక్కి 5 సినిమాలు వచ్చినా.. అన్నింటినీ ఆడియన్స్ చూస్తారని నమ్ముతున్నారు వాళ్లు. అందులో ఏ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బ్లాక్‌బస్టర్ అవ్వడం అయితే పక్కా. మరి గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్లలో ఏది ప్రేక్షకులకు బాగా చేరువవుతుందో చూడాలి.