Rambha | సీనియర్ నటి రంభ పరిచయం అక్కర్లేని పేరు. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రంభ దాదాపు అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించింది. గ్లామర్ క్వీన్‌గా పేరు సంపాదించుకున్న రంభను గోల్డెన్ లెగ్గా కూడా అప్పట్లో పిలిచేవారు. పేరుకి తెలుగు నటి అయినా దాదాపు 7 భాషల్లో సినిమాలను చేసింది. ప్రతి భాషలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. దాదాపు 15 సంవత్సరాలు ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఈమె చివరగా మలయాళంలో వచ్చిన ‘ఫిలింస్టార్’ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత బిజినెస్ మెన్ అయిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుని ఇంటికే పరిమిత మైంది.
ఇక మళ్ళి 12 ఏళ్ళకు రంభ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ స్టార్ కార్తీ హీరోగా ‘సర్దార్’ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అభిమన్యుడు ఫేం పీయస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీలకపాత్ర కోసం మేకర్స్ రంభను సంప్రదించగా, రంభ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.