Rama Teaser | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’. దాదాపు రూ.3000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి ‘రామ’ పేరుతో రాబోతున్న ఈ టీజర్ విడుదలకు ముందు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏప్రిల్ 2న టీజర్ విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. దీనితో పాటు ఈ టీజర్ నిడివికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ‘రామ’ టీజర్ రన్‌టైమ్ 2 నిమిషాల 38 సెకన్లుగా ఉంది. ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూనివర్సల్(‘U’) రేటింగ్ ఇచ్చింది, దీంతో ఈ టీజర్‌ను అన్ని వయసుల వారు థియేటర్లలో వీక్షించవచ్చు.
ఇప్పటివరకు చిత్రబృందం కేవలం టైటిల్ వీడియోతో పాటు 3 నిమిషాల 3 సెకన్ల నిడివి గల ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ అనే క్లిప్‌ను మాత్రమే పంచుకుంది. భారీ వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో కూడిన ఆ వీడియోలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యష్ లుక్‌లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను చూపించారు.అయితే ఇప్పుడు రాబోతున్న టీజర్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ దృశ్యకావ్యం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.