Toaster Trailer | బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘టోస్టర్’ (Toaster). ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో నేరుగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సినిమా అంతా భార్యాభర్తలు, ఒక టోస్టర్ చుట్టూ తిరగబోతున్నట్లు అర్థమవుతోంది. సినిమాలో రాజ్‌కుమార్ రావు విపరీతమైన పిసినారివాడిగా కనిపించబోతున్నాడు. డబ్బును చాలా జాగ్రత్తగా, లెక్కలు చూసుకుని మరీ ఖర్చు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక పెళ్లికి వెళ్లిన రాజ్.. ఆ కొత్త జంటకు ఒక ‘టోస్టర్’ను బహుమతిగా ఇస్తారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దాంతో తాను గిఫ్ట్‌గా ఇచ్చిన టోస్టర్‌ను ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఆ పెళ్లి వారి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ టోస్టర్ అతనికి దొరికిందా లేదా? ఆ చిన్న వస్తువు కోసం రాజ్ పడిన పాట్లు, చేసిన సాహసాలు ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్రాతో పాటు అభిషేక్ బెనర్జీ, ఉపేంద్ర లిమాయే, జితేంద్ర జోషి, సీమా పహ్వా మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్ దాస్ చౌదరి దర్శకత్వం వహించగా. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ రావు మరియు ఆయన సతీమణి పత్రలేఖ సంయుక్తంగా తమ స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. ఈ క్రేజీ డార్క్ కామెడీ చిత్రం ఏప్రిల్ 15 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.