ఓ జనరేషన్ ప్రేక్షకులకు చాలా ఇష్టుడైన హీరో డా.రాజశేఖర్. ఆయన సినిమాను సగటు ప్రేక్షకుడితోపాటు అందరు హీరోల అభిమానులూ అభిమానించేవారు. ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ అంటూ ఆయన్ని ఇష్టంగా పిలుచుకునేవారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, మమతల కోవెల, అల్లరి ప్రియుడు, అన్న, శివయ్య.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విలక్షణ నటుడి కెరీర్లో ఎన్నో అద్భుతాలు. కెరీర్ పరంగా కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్… ‘బైకర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కథానాయకుడు శర్వానంద్ తండ్రిగా ఇందులో కీలకమైన పాత్రను పోషించారాయన. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు డా.రాజశేఖర్.
నేను కష్టపడి, ఇష్టంతో చేసిన సినిమా ‘బైకర్’. అందుకే ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ కథ విన్నప్పుడు నా పాత్రతో పాటు కథ కూడా చాలాబాగా నచ్చింది. అనుకున్నట్టే దర్శకుడు అభిలాష్‌రెడ్డి చాలా బ్రిలియంట్‌గా సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా నా క్యారెక్టర్ మీద ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారు. అనుకున్నది వచ్చేంతవరకూ తను రాజీపడలేదు. ఆయన విజన్ వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. అలాగే రేసింగ్ సీన్స్ హాలీవుడ్ సినిమాల రేంజ్లో ఉంటాయి. శర్వానంద్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. తను బెస్ట్ కొలీగ్. ఓ ఫ్రెండ్స్‌లా ఇద్దరం పనిచేశాం. యూవీ క్రియేషన్స్ వారిది రాయల్ ట్రీట్మెంట్. అసలు రాజీ అనే పదం వారికి తెలియదు. హాలీవుడ్ క్వాలిటీతో ఈ సినిమా నిర్మించారు.
నాకు చిన్నప్పట్నుంచీ బైక్స్ అంటే ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో బుల్లెట్ ఉంటేది. సెలవుల్లో అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఆ బుల్లెట్ ఎక్కి ఊరంతా తిరిగేవాడ్ని. నా ‘శేషు’ సినిమా కోసం ప్రత్యేకంగా యమహా సిక్స్ ఫిఫ్టీ బండి కొనుక్కొని వాడాను. ఆ తర్వాత కూడా అదే బైక్‌ని రోజూ నడిపేవాడ్ని. నా డ్రైవింగ్ తీరు చూసి, ప్రమాదకరంగా నడుపుతున్నానని నాకు తెలియకుండానే బైక్‌ని అమ్మేసింది జీవిత. దానికి తగ్గట్టే ఈ సినిమాలో నా పాత్ర పేరు బుల్లెట్ సునీల్. ఈ పాత్ర వివరాల మాత్రం మీరు తెరపైనే చూడాలి.
పవన్ సాధినేని దర్శకత్వంలో ‘మగాడు’ అనే సినిమా చేస్తున్నాను. ఇంకా 20శాతం మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఆ సినిమా షూటింగ్‌ని నెక్ట్స్ మంత్ పూర్తి చేస్తాను. అలాగే నా కుమార్తె శివానితో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. రమ్య విశ్వదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తా.