దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఆయన బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు విషయాల గురించి ప్రస్తావించారు.
ఇక తాజాగా పునీత్ ఇంటికి చేరుకున్న రాజమౌళి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులని పరామర్శించారు. అనంతంరం మీడియాతో మాట్లాడిన ఆయన .. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. నన్ను ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. ఎంతో సరదాగా మాట్లాడారు. మన మధ్య ఆయన లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
పునీత్ ఎంతోమందికి సాయం చేశారని మరణం తర్వాతే అందరికీ తెలిసింది. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. కానీ పునీత్ అలా కాదు. తను ఎంతో మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పలేదు అని రాజమౌళి అన్నారు. కాగా, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి జనని సాంగ్ తాజాగా విడుదల కాగా ఇది పది మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టింది.