Telugu Cinema | సినిమాల్లో.. రాముడు సూపర్ హిట్. కృష్ణుడు బంపర్ హిట్. వేంకటేశ్వరుడు, శివుడు అందరూ మెగా హిట్టే. ఇలా సిల్వర్ స్క్రీన్‌పై వెలిగిన వేల్పులంతా నిర్మాతకు లక్ష్మీదేవిని అనుగ్రహించిన వారే! వీరందరినీ మించిన వెండితెర వీరుడు వీరహనుమంతుడు. ఈ చిరంజీవి పాత్రను రామాయణ కథలోనే కాదు.. ద్వాపరం నాటి కృష్ణగాథల్లోనూ చూపించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శక నిర్మాతలు. హనుమ చుట్టూ కథలు అల్లుకొని.. బాక్సాఫీస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఆంజనేయుడి పాత్ర ప్రవేశంతోనే కథనంలో వేగం పెరుగుతుంది. ప్రేక్షకుల్లో ఉత్సుకత హెచ్చుతుంది. అందుకే ఆయన్ను సక్సెస్ ఫార్ములాగా భావిస్తుంటారు సినీజనం. ఇటీవల ‘హను-మాన్’ పేరుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. దీనికి సీక్వెల్‌గా సిద్ధమవుతున్న ‘జై హనుమాన్’పై షూటింగ్ నుంచే కొండంత అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఆంజనేయుడిగా కాంతార ఫేమ్ రిషభ్ శెట్టి కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన స్టిల్ విడుదల అయ్యీ కావడంతోనే లంక దాటేంతలా వైరల్ అయ్యిందంటే హనుమంతుడి బలమెంతో అర్థం చేసుకోవచ్చు.
92ఏండ్ల తెలుగు సినిమా చరిత్రలో హనుమంతుడిగా తెరపై పూర్తి స్థాయిలో నటించిన హీరో లేడన్నది నిజం. అయితే.. ఇన్నాళ్లకు రిషభ్ శెట్టి కనిపించ బోతున్నాడు. ‘హను-మాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్‌వర్మ.. ఆ సినిమాకు సీక్వెల్‌గా చేస్తున్న ‘జై హనుమాన్’ చిత్రంలో రిషభ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన స్టిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా కన్నడిగుడైన రిషభ్ శెట్టి.. తెలుగు తెరపై పూర్తిస్థాయిలో హనుమంతుడిగా కనిపించబోతున్న తొలి హీరో అన్నమాట!
ఎన్నిసార్లు విన్నా, ఎంత చదివినా తనివితీరని గాథ.. రామకథ. అదో వజ్రభాండాగారం. అందులో వెలకట్టలేని మేలి వజ్రం ఆంజనేయుడు. నామస్మరణ మాత్రం చేత హృదయాలను సుందరమయం చేసే దివ్య ఔషధం హనుమ నామం. అందుకే ఆ కపివరుణ్ని ‘రామాయణ మహామాలా రత్నం’ అన్నారు. నిజానికి రామాయణంలో రాముడితో సరిసమానమైన వీరుడెవరన్నా ఉంటే అది హనుమంతుడు మాత్రమే. సకల గుణవంతుడు, సర్వ శక్తిమంతుడు అయిన హనుమను రుద్రాంశ సంభూతుడిగా భావిస్తారు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం కూడానూ! రామాజ్ఞ లేదు కానీ, ఆనతి ఇచ్చి ఉంటే.. లంకకు నిప్పెట్టినప్పుడే రావణుని పని కూడా ప్రశాంతంగా ముగించేసేవాడే!! ఇంతటి వీరుడు కాబట్టే.. ఆంజనేయుడిపై వచ్చినన్ని కల్పిత కథలు మరే పురాణ పాత్రమీదా రాలేదు. నాటక కర్తలు, సినీ రచయితలు సైతం జనాన్ని ఆనందింపజేయడానికి హనుమ చుట్టూ ఎన్నో కథలు అల్లారు. రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, అర్జున గర్వభంగం, బలరామ గర్వభంగం, గరుడ గర్వభంగం, శనీశ్వర గర్వభంగం.. ఇవన్నీ అలా పుట్టిన కథలే. వీటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. మరికొన్ని నాటకాలుగా ప్రాచుర్యం పొందాయి.
మన సినిమా రచయితలు.. రాముణ్ని ప్రేరణగా తీసుకొని హీరో పాత్రల్ని అల్లేస్తుంటారు. కానీ, హాలీవుడ్లో మాత్రం ఆంజనేయుడి నుంచి స్ఫూర్తి పొందారేమో అనిపిస్తుంది. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, హీమాన్.. ఈ సూపర్‌హీరోల పాత్రలకు మూలం మన హను‘మ్యానే’! హనుమంతుడి పాత్రలో అలవికాని హీరో ఇజం చూపించే ఇదున్నా.. మన హీరోలు మాత్రం ఆ పాత్ర పోషించడానికి ధైర్యం చేయలేదు. కారణం, వానరుడు కనుక తోక సహజం. పైగా పెదవులు ఉబ్బెత్తుగా ఉండటం వల్ల గ్లామర్‌గా కనిపించమనే ఫీలింగ్! దీనికితోడు హనుమయ్య అస్ఖలిత బ్రహ్మచారి. కాబట్టి డ్యూయెట్లకు అవకాశం ఉండదు. అందుకే మన హీరోలు ఆంజనేయుడికి ఆమడ దూరం పాటిస్తూ వచ్చారు.
దేవుడి పాత్రలకు పేరెన్నికగన్న ఎన్టీయార్ కూడా హనుమ జోలికి వెళ్లలేదు. ఆ స్థాయి హీరో ఎవరైనా ఆంజనేయుడిగా కనిపించాడంటే అది చిరంజీవి ఒక్కడే! ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో కాసేపు హనుమంతుడిగా కనిపించి, అభిమానుల్ని మురిపించారు. ‘హనుమాన్’ అనే యానిమేషన్ ఫిల్మ్‌లో హనుమంతుడి పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పారు. చిరంజీవి స్వతహాగా హనుమంతుని భక్తుడు. అందుకే ఆ అవకాశాలను మహద్భాగ్యాలుగా భావించాడేమో! అలాగే ‘దేవుళ్లు’ సినిమాలో రాజేంద్రప్రసాద్, ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో అర్జున్ మానవరూపాన్ని దాల్చిన హనుమంతులుగా అదరగొట్టారు.
హనుమంతుడి నేపథ్యంలో ఉండే సన్నివేశాలు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఆ సన్నివేశాలను చూస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ‘లవకుశ’ సినిమాలో కుశలవుల చేతిలో లక్ష్మణ, శత్రుఘ్నులు ఓడిపోయాక, స్వయంగా రాముడే యుద్ధానికి విచ్చేసే సన్నివేశాన్ని తేలిగ్గా మరిచిపోగలమా!? ఆ సన్నివేశంలో రథంపై వస్తున్న రాముడి పక్కన హనుమంతుణ్ని చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ పాత్ర చేసిన నటుడి పేరు తెలియకపోయినా.. ఆయన అభినయం మాత్రం ఇప్పటికీ జన హృదయాల్లో నిలిచే ఉంది. అలాగే ‘పాండవ వనవాసం’ చిత్రంలో భీమసేనుణ్ని.. ఆంజనేయుడు పరీక్షించే సన్నివేశం అజరామరం.
ఆ సీన్లో ఆంజనేయుడిగా కనిపించిన ఆ నటుడి రూపం.. ఆ విశ్వరూపం.. ఆ సన్నివేశంలో భీమసేనుడిగా ఎన్టీఆర్ అభినయం.. ‘ఆంజనేయా.. మహానుభావా..’ అంటూ ఘంటసాల గంభీర గానం.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులు మరువలేని జ్ఞాపకాలు. ఎన్టీఆర్ ‘సూపర్‌మ్యాన్’ సినిమాలో హనుమంతుడి ఎపిసోడ్ ఇప్పటికీ మెమొరబుల్. అప్పట్లో పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేసిన సన్నివేశాలు అవి. అలాగే బాపు ‘ముత్యాలముగ్గు’లో హనుమ పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమే.
ఇక హనుమంతుడిగా మెప్పించిన నటదిగ్గజాలను గుర్తు చేసుకుంటే.. ముందు చెప్పుకోవాల్సిన పేరు అర్జా జనార్దన్‌రావు. బలిష్ఠమైన దేహంతో హనుమంతుడిగా ఆయన తెరపై కనిపిస్తే.. అచ్చుగుద్దినట్టు ఆంజనేయస్వామిలాగే అనిపించేవారు. దానికితోడు అద్భుతమైన నటనాపటిమ.. ఆయన్ను వెండితెర వీరాంజనేయుడ్ని చేసింది. బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, ముత్యాలముగ్గు, కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణసత్య’ చిత్రాలు ఆంజనేయుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘వీరాంజనేయ’ చిత్రంలో హీరోగా కూడా నటించారు అర్జా జనార్దనరావు. ఆయన ఆంజనేయుడిగా నటించిన కొన్ని తమిళ చిత్రాలు కూడా తెలుగులో డబ్ అయ్యాయి. ఒక్క తెలుగులోనే కాదు, భారతదేశంలోనే ఆంజనేయుడిగా ఎక్కువ చిత్రాల్లో నటించిన నటుడు అర్జా జనార్దన్‌రావు.
జనార్దన్‌రావు తర్వాత హనుమ పాత్రలో చెప్పుకోదగ్గ పేరు సాధించింది రాజనాల. నిజానికి ఆయన ఒకే ఒక్క సినిమాలో హనుమంతుడిగా నటించారు. అదే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. సీఎస్‌రావు దర్శకుడు. ఈ సినిమాలో వీరమారుతిగా విశ్వరూపం చూపించారు రాజనాల. ఆహార్యం విషయంలో జనార్దనరావుకి మార్కులు ఎక్కువ పడొచ్చేమోగానీ.. అభినయం విషయంలో మాత్రం రాజనాలదే పైచేయి. విలన్ పాత్రలు చేసే భీమారావు కూడా కొన్ని సినిమాల్లో హనుమంతుడిగా కనిపించారు.
ఇక దేశవ్యాప్త సంచలనం బుల్లితెర ‘రామాయణం’. రామానందసాగర్ దర్శకత్వం వహించిన ఈ భారీ ధారావాహికలో హనుమంతుడి పాత్రను ప్రముఖ మల్లయోధుడు, నటుడు దారాసింగ్ పోషించారు. ఓ జనరేషన్‌కి హనుమంతుడు అంటే ఆయనే. తర్వాత ఆయన కుమారుడు విదూ దారాసింగ్ కూడా జై వీరహనుమాన్, విష్ణుపురాణ్, అయోధ్య కీ రామ్‌లీల తదితర సీరియల్స్‌లో హనుమంతుడిగా మెరిశారు. అలాగే తెలుగులో వచ్చిన శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాల్లో కూడా ఆయనే హనుమంతుడిగా మెప్పించాడు.
ఆంజనేయస్వామి అంటే ఓ ధైర్యం.. ఓ సెంటిమెంట్.. అలాగే చాలామందికి బలహీనత కూడా. ఆయన విజయపతాకాన్ని శుభానికి చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు ఆయనంటే ప్రాణం. ‘హను-మాన్’ సినిమా అంతటి విజయాన్ని సాధించడానికి కారణం అదే. ఆ సినిమా చివర్లో ఆంజనేయ సాక్షాత్కారాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఆడియన్స్‌ని రోమాంచితుల్ని చేశాడు. అందుకే.. సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి హనుమంతుడి ప్రేరణగా ఇంకెన్ని కల్పిత కథలు అల్లినా.. వాటికి జనం బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. కారణం.. ఆయన రియల్ సూపర్‌హీరో కాబట్టి!
– బుర్రా నరసింహా