Adipurush | నిజం చెప్పాలంటే 2023లో ఇప్పటివరకు పఠాన్ మినహా సరైన పాన్ ఇండియా సినిమా పడలేదు. ఇది కూడా కేవలం హిందీలో మాత్రమే విజయం సాధించింది. రీజనల్ లాంగ్వేజెస్లో పఠాన్ ప్రభావం తక్కువగానే చూపించింది. ఒకవేళ ఇక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి ఉంటే కచ్చితంగా రూ.1500 కోట్లకు పైగా షారుక్ ఖాన్ సినిమా వసూలు చేసి ఉండేది. అలా జరగలేదు కాబట్టి 1000 కోట్ల దగ్గరే ఆగిపోయింది.
మన దగ్గర వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విజయం సాధించాయి. దాంతో పాటు బలగం, దసరా, విరూపాక్ష లాంటి సినిమాలు కూడా అద్భుతమైన విజయం సాధించాయి.
తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. కాకపోతే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి రేంజ్ సినిమా మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఆ లోటు ఆదిపురుష్ తీరుస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. అందుకే దీని మీద అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే రూ.400 కోట్లకు పైగా జరిగింది అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఇన్ని డబ్బులు వెనక్కి రావు. ఏమాత్రం తేడా కొట్టిన తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, హిందీలో టీ సిరీస్కు నష్టాలు ఊహించని విధంగా ఉంటాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఎన్నో కఠినమైన సవాళ్లు ఉన్నాయి.
వాటిని ఆదిపురుష్ స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ సినిమా ఎక్కడ నిలబడుతుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇండియన్ సినిమా ఓపెనింగ్ డే రికార్డులన్నీ ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమా రూ.224 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. ఆ తర్వాత రెండో స్థానంలో బాహుబలి ది కన్క్లూజన్ రూ.214 కోట్లతో ఉంది. రూ.164 కోట్లతో కేజీఎఫ్ 2 మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. రూ.125 కోట్లతో సాహో సినిమా నాలుగో ప్లేస్లో ఉంది. పఠాన్ రూ.104 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆదిపురుష్ వీటిలో ఏ స్థానంలో నిలుస్తుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. దీనిపై ఉన్న అంచనాలు.. ఇది విడుదలవుతున్న తీరు చూసిన తర్వాత కచ్చితంగా మొదటి మూడు స్థానాల్లోనే ఉండాలి.. అలా జరగకపోతే ఓపెనింగ్ విషయంలో ఆదిపురుషుడు వెనకబడ్డట్టే అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి వీటిలో ప్రభాస్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.