Prabhas First Look Posters | మాములుగా ఒక స్టార్ హీరో ఫస్ట్ లుక్ రిలీజవుతుందంటే అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో ఫస్ట్ లుక్ రిలీజవుతుందంటే ఫ్యాన్సే కాదు సగటు సినీ ప్రేక్షకులు సైతం భారీ ఎక్స్ పెక్టేషన్సే పెట్టుకుంటారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్లు చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఆహా ఓహో అన్న రేంజ్ లో లేవు. ఇక డార్లింగ్ అభిమానులైతే పోస్టర్లను చూసి మేకర్స్ ను బండబూతులు తిట్టుకున్న సందర్భాలున్నాయి. సాహోలో ప్రభాస్ ఫేస్ ను మాస్క్ తో కప్పేసి ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ను చూసిన ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. ఇక రాధేశ్యామ్ లో డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై నుంచి కింది వరకు ప్రభాస్ సూట్ వేసుకుని చేతిలో బ్రీట్ కేస్ తో ఫుల్ క్లాస్ లుక్ తో ఉండటంతో మాస్ అభిమానులు కాస్త నిరాశ పడ్డారు.
ప్రభాస్ లాంటి కమర్షియల్ హీరోను మరీ ఇంత క్లాస్ గా చూపించారేంటి అని చాలా మంది అభిమానులు యూవీని ట్యాగ్ చేసి అప్పట్లో తెగ కామెంట్స్ చేశారు. ఇక ఆదిపురుష్ ఫస్ట్ లుక్ గురించి ప్రత్యేకించి ఒక బుక్కునే రాయచ్చు. ట్రోలింగ్ లో ఎన్ని రకాలుంటే అన్నిటినీ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై వాడేసారు. అంతలా ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు పోస్టర్ చూసి మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. అంతలా డార్లింగ్ అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సలార్ పోస్టర్ సైతం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మిగితావాటితో పోల్చితే మట్టుకు సలార్ పోస్టర్ బెటర్ అనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ ను మాత్రం పోస్టర్ బాగానే ఆకట్టుకుంది. ఇక ఇవన్నీ ఒకత్తయితే కొన్ని గంటల ముందు రిలీజైన ప్రాజెక్ట్-K పోస్టర్ అభిమానులను ఎంతలా నిరాశపరిచిందో మాటల్లో వర్ణించలేనిది.
బహుశా ఐరెన్ మ్యాన్ రేంజ్ లో ప్రభాస్ పోస్టర్ ను ప్రజెంట్ చేయాలని అనుకున్నారేమో కానీ.. పోస్టర్ మట్టుకు డార్లింగ్ అభిమానులను మాత్రం తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. ఐరన్ మ్యాన్ 2160pలో ఉంటే ప్రభాస్ పోస్టర్ 144pలో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ప్రభాస్ తల వేరొకరి శరీరానికి అతికించినట్లు పోస్టర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్క పోస్టర్ తో సినిమా ఫేట్ ను అస్సలు అంచనా వేయలేం. ఎందుకంటే నాగ్ అశ్విన్ డీటేయిలింగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంత పర్ఫెక్ట్ గా పోట్రేయ్ చేస్తాడో గత రెండు సినిమాలు చూస్తే తెలుస్తుంది. అలాంటిది నాలుగు సంవత్సరాలకు పైగా ప్రాజెక్ట్-Kపై కూర్చున్న నాగీ ఇంకెంత పర్ఫెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పైగా మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ యూఎస్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం నాగీ దానిపైనే వర్క్ చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ పోస్టర్ రిలీజ్ చేసి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇలా ప్రభాస్ సినిమాల మట్టుకు వచ్చే సరికి ఫస్ట్ లుక్ పోస్టర్ బెడిసి కొడుతున్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-k గ్లింప్స్ ఇండియాలో జూలై 21న రిలీజ్ కానుంది. అదే రోజు సినిమా టైటిల్ ను, రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.